అహ్మదాబాద్: బీజేపీ మాజీ కార్పొరేటర్ కుమారుడిపై ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక గ్యాంగ్ దాడి చేసింది. ఈ సందర్భంగా కత్తితో పొడిచి అతడ్ని హత్య చేశారు. (Ex-BJP Corporator’s Son Stabbed) ప్రధాన నిందితుడితోపాటు ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. గుజరాత్‌లోని వడోదర జిల్లాలో ఈ సంఘటన జరిగింది. నాగర్వాడ ప్రాంతంతో ఆదివారం రాత్రి బాబర్ పఠాన్, అతడి గ్యాంగ్ కలిసి రచ్చచేశారు. బీజేపీ నేత, మాజీ కార్పొరేటర్ రమేష్ పర్మార్ కుమారుడైన 35 ఏళ్ల తపన్ పర్మార్ స్నేహితులపై వారు దాడి చేశారు. గాయపడిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలిసిన తపన్ తన అనుచరులతో కలిసి ఆ ఆసుపత్రికి వెళ్లాడు. గాయపడిన తన స్నేహితుడు, అతడి సోదరుడ్ని కలిశాడు.
కాగా, పోలీసులను తప్పుదారి పట్టించేందుకు బాబర్ పఠాన్ ప్రయత్నించాడు. కరేలిబాగ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తనపై దాడి జరిగిందని ఫిర్యాదు చేశాడు. వాంతులు చేసుకున్న అతడు తనకు అసౌకర్యంగా ఉందని చెప్పాడు. దీంతో పోలీసులు పఠాన్‌ను ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు.
మరోవైపు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉన్న తపన్ పర్మార్‌పై తన గ్యాంగ్‌తో కలిసి బాబర్ పఠాన్ దాడి చేశాడు. కత్తితో పొడిచి అతడ్ని హత్య చేశాడు. వెంటనే స్పందించిన పోలీసులు పఠాన్‌తోపాటు ఐదుగురు అనుచరులను అరెస్ట్ చేశారు. పారిపోయిన ఇతర నిందితుల కోసం వెతుకుతున్నారు. బీజేపీ మాజీ కార్పొరేటర్ కుమారుడు తపన్ హత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.