Virat Kohli | భారత స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) మళ్లీ రంజీల్లోకి దిగబోతున్నాడు. దాదాపు 12 సంవత్సరాల తర్వాత రంజీ ట్రోఫీ (Ranji Trophy)లో తొలి మ్యాచ్‌ను ఆడనున్నాడు. ఈ నెల 30న రైల్వేస్‌తో జరిగే ఢిల్లీ మ్యాచ్ (Delhi Match)కు అందుబాటులో ఉంటాడు. ఈ నెల 23న సౌరాష్ట్రతో జరిగే మ్యాచ్‌కు దూరం కానున్నాడు. మెడకు గాయమైన విషయం తెలిసిందే. కానీ, రంజీ చివరి లీగ్మ్యాచ్కు అందుబాటులో ఉంటానని ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్‌కు సమాచారం ఇచ్చాడు. ఆస్ట్రేలియాలో జరిగిన బోర్డర్-గవాస్కర్ టెస్ట్ సిరీస్ చివరి టెస్టు మ్యాచ్‌లో మెడకు గాయమైంది. ఆ సమయంలో ఫిజియో గాయాన్ని పరిశీలించారు.
విరాట్ చివరిసారిగా 2012లో ఉత్తరప్రదేశ్‌తో టెస్టులో ఢిల్లీ తరఫున చివరి మ్యాచ్ ఆడాడు. రైల్వేస్‌తో జరిగే మ్యాచ్‌కు విరాట్ అందుబాటులో ఉన్నట్లు డీడీసీఏ ప్రెసిడెంట్ రోహన్ జైట్లీ, టీమ్ మేనేజ్మెంట్కు తెలియజేసినట్లు ఢిల్లీ ప్రధాన కోచ్ శరణ్‌దీప్ సింగ్ మీడియాకు తెలిపారు. ఆస్ట్రేలియా పర్యటనలో విరాట్ ఫామ్ లేమితో పరుగులు చేయలేకపోయాడు. పెర్త్ టెస్ట్ రెండో ఇన్నింగ్‌లో సెంచరీ చేసినా.. మిగతా మ్యాచ్‌లలో విఫలమయ్యాడు. ఐదు మ్యాచ్‌లలో తొమ్మిది ఇన్నింగ్స్‌లలో 23.75 సగటుతో 190 పరుగులు మాత్రమే చేశాడు.
ఆస్ట్రేలియా పర్యటనతో పాటు స్వదేశంలో న్యూజిలాండ్‌తో వరుస ఓటముల నేపథ్యంలో బీసీసీఐ కీలక చర్యలు చేపట్టింది. తప్పనిసరిగా ఆటగాళ్లు అందరూ దేశవాళీ క్రికెట్లో ఆడాలని స్పష్టం చేసింది. ఈ మేరకు బోర్డు కొత్త పాలసీని విడుదల చేసింది. జాతీయ జట్టు, సెంట్రల్ కాంట్రాక్ట్‌కు అర్హత సాధించేందుకు ఆటగాళ్లంతా దేశవాళీ టోర్నీలో పాల్గొనడం తప్పనిసరిగా మారింది. నిర్దిష్ట పరిస్థితుల్లో మాత్రమే మినహాయింపు ఉంటుంది.
Rohit Sharma | రంజీ బాటలో రోకో.. దేశవాళీ వైపు మళ్లుతున్న స్టార్ క్రికెటర్లు