Rohit Sharma | ముంబై: జాతీయ జట్టులో కొనసాగాలంటే దేశవాళీలు ఆడాల్సిందేనని కరాఖండీగా చెప్పిన బీసీసీఐ ఆదేశాలను భారత స్టార్ క్రికెటర్లు ఆచరణలో పెడుతున్నారు. సుమారు దశాబ్దకాలంగా డొమెస్టిక్ క్రికెట్ వైపునకు కన్నెత్తి చూడని టీమ్ఇండియా సారథి రోహిత్ శర్మ, రన్ మిషీన్ విరాట్ కోహ్లీ దేశవాళీ బాట పట్టారు. పదేండ్ల తర్వాత హిట్‌మ్యాన్‌తో పాటు కోహ్లీ రంజీ మ్యాచ్ ఆడనున్నారు. త్వరలో జమ్ముకశ్మీర్‌తో జరుగబోయే రంజీ మ్యాచ్‌లో అతడు తన రాష్ట్ర జట్టు ముంబైకి ప్రాతినిధ్యం వహించనున్నాడు.
హిట్‌మ్యాన్‌తో పాటు యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్, మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ సైతం ముంబై ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టులో ఉన్నారు. అజింక్యా రహానే సారథిగా వ్యవహరించనున్న ముంబై జట్టు ఈనెల 23 నుంచి జమ్ముకశ్మీర్‌తో మ్యాచ్ ఆడనుంది. సీనియర్ స్పిన్నర్ రవీంద్ర జడేజా.. సౌరాష్ట్ర తరఫున ఆడనుండగా రిషభ్ పంత్ ఢిల్లీ తరఫున ప్రాతినిధ్యం వహించనున్నాడు. ఏడేండ్ల తర్వాత పంత్ దేశవాళీలు ఆడనున్నాడు.
ఈ మ్యాచ్ కోసం ప్రకటించిన 22 మంది సభ్యుల జట్టులో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పేరున్నప్పటికీ అతడు మెడ నరాల నొప్పితో రంజీ మ్యాచ్ నుంచి తప్పుకున్నాడు. కానీ ఈనెల 30న ఢిల్లీ.. రైల్వేస్‌తో ఆడబోయే మ్యాచ్‌లో కోహ్లీ బరిలోకి దిగబోతున్నాడు. ఈ విషయాన్ని డీడీసీఏ అధ్యక్షుడు రోహన్జైట్లీతో పాటు టీమ్ మేనేజ్మెంట్ దృష్టికి కోహ్లీ తీసుకెళ్లినట్లు తెలిసింది. దీంతో 2012 తర్వాత తొలిసారి ఈ స్టార్ బ్యాటర్ దేశవాళీలో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. ఇక హైదరాబాదీ స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్, పంజాబ్ తరఫున శుభ్‌మన్ గిల్ సైతం వారి జట్లకు ఆడేందుకు సుముఖత వ్యక్తం చేశారు.