న్యూఢిల్లీ: భారత స్టార్ క్రికెటర్ రింకూసింగ్, యువ ఎంపీ ప్రియా సరోజ్ పెండ్లి కుదిరింది. గత కొన్ని రోజులుగా పెండ్లిపై వస్తున్న వార్తలకు ఇరు కుటుంబాలకు చెందిన పెద్దలు స్పష్టత ఇచ్చారు. ‘రింకూ, ప్రియా పెండ్లి ఖరారైంది. ఇప్పటికైతే ఎలాంటి శుభకార్యం జరుగలేదు. పార్లమెంటరీ కమిటీ సభ్యురాలిగా ప్రియా ప్రస్తుతం తిరువనంతపురం పర్యటనలో ఉంది.
మరోవైపు ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో రింకూ బిజీగా ఉన్నాడు. ఇద్దరి అనుకూలంగా ఉండే తేదీల కోసం చూస్తున్నాం. నిశ్చితార్థం తేదీ కూడా ఇంకా ఖరారు కాలేదు. ఇరు కుటుంబాలకు చెందిన పెద్దలు మాట్లాడుకుని ఒక నిర్ణయానికి వస్తాం’ అని ప్రియా తండ్రి తూఫానీ సరోజ్ పేర్కొన్నారు. ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్ ద్వారా రింకూ ఒక్కసారిగా వార్తల్లో వ్యక్తిగా నిలువగా, 25 ఏండ్ల వయసులోనే ప్రియా సరోజ్ లోక్‌సభ ఎంపీగా ఎన్నికైంది.