Vinesh Phogat : స్వదేశంలో చాంపియన్ తరహా స్వాగతం చవిచూసిన వినేశ్ ఫొగాట్ (Vinesh Phogat) ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సొంత ఊరైన బలాలి(Balali)లో గోల్డ్ మెడల్ స్వీకరించిన ఆమె ఒలింపిక్ పతకం చేజార్చుకోవడం తన జీవితంలో పెద్ద గాయమని అంది. అంతేకాదు రెజ్లింగ్‌ను వదిలేస్తానా? వీడ్కోలును వాపస్ తీసుకుంటానా? అనేది ఇప్పుడే చెప్పలేను అని వినేశ్ తెలిపింది.
‘పారిస్ ఒలింపిక్స్‌లో పతకం కోల్పోవడం నా జీవితంలో చాలా పెద్ద గాయం. అయితే.. ఇక్కడ మీ ప్రేమాభిమానుల చూశాక ఆ గాయం నుంచి కోలుకుంటాననే ధైర్యం వచ్చింది. ఇక వీడ్కోలు గురించి అంటారా.. ఇప్పుడే ఏమీ చెప్పలేను. ఇక ఏడాదిన్నర పాటు రెజ్లింగ్ సమాఖ్య(WFI)పై చేసిన పోరాటాన్ని మళ్లీ కొనసాగిస్తాను’ అని వినేశ్ వెల్లడించింది.
విశ్వ క్రీడల్లో పతం చేజార్చుకున్న వినేశ్‌కు రెజ్లర్లు బజ్రంగ్ పూనియా, సాక్షి మాలిక్‌లు చాంపియన్ తరహాలో స్వాగతం పలికారు. అనంతరం బలాలిలో ఆమె మేనమామ మహవీర్ ఫొగాట్(Mahavir Phogat), ఖాప్ పంచాయతీ పెద్దలు వినేశ్‌కు గౌరవ మర్యాదలతో ఆహ్వానించారు.
‘ఒలింపిక్ మెడల్ గెలవకున్నా సరే.. నువ్వు ఎప్పటికీ చాంపియన్‌వే’ అంటూ ఆమెను ఘనంగా సన్మానించారు. రెజ్లర్‌ను పూల దండలు, తలపాగాతో సన్మానించిన అనంతరం వినేశ్‌కు స్వర్ణ పతకాన్ని అందజేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఒలింపిక్స్ పతకంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న వినేశ్ ఫొగాట్ కల చెదిరింది. ఫైనల్ ఫైట్‌కు ముందు 100 గ్రాముల అదనపు బరువుతో ఫైనల్ ఆడలేకపోయిన ఆమె కన్నీటిపర్యంతమైంది. ఆ బాధలోనే రెజ్లింగ్‌కు వీడ్కోలు కూడా చెప్పేసింది. అనంతరం వినేశ్ తనపై వేటు సవాల్ చేస్తూ అర్బిట్రేషన్ కోర్టు (CAS)లో అప్పీల్ చేసింది. అయితే.. మూడు సార్లు తీర్పును వాయిదా వేసిన కాస్ చివరకు పతకం ఇవ్వలేమని చెప్పింది. దాంతో, నిరాశగా వినేశ్ స్వదేశానికి వచ్చేసింది.