Ben Duckett : ఇంగ్లండ్ విధ్వంసక ఓపెనర్ బెన్ డకెట్(Ben Duckett) భారత యువకెరటం యశస్వీ జైస్వాల్ (Yashasvi Jaiswal)పై గతంలో చేసిన తన వ్యాఖ్యల్ని సమర్ధించుకున్నాడు. తన కామెంట్లో పొరపాటేమీ లేదని, యశస్వీకి అదొక పొగడ్డ అని డకెట్ చెప్పాడు. రాజ్‌కోట్ టెస్టులో యశస్వీ మెరుపు శతకం క్రెడిట్ కొంచెం తమకే చెందుతుందని ఇంగ్లండ్ ఓపెనర్ అన్నాడు. అప్పట్లో అతడి కామెంట్స్ దుమారమే రేపాయి. అయితే.. తానేమీ తప్పుగా అనలేదని, యశస్వీకి అది కాంప్లిమెంట్ అని డకెట్ తెలిపాడు.
‘భారత పర్యటనలో యశస్వీని నేను పొగిడాను. నిజంగా అది మంచి కాంప్లిమెంట్. అతడొక వరల్డ్ క్లాస్ ప్లేయర్ అని చెప్పాను. అప్పటివరకూ నేను తప్ప అతడి గురించి ఎవరూ ఆ మాట చెప్పలేదు’ అని డకెట్ తాజాగా డెయిలీ మెయిల్‌తో అన్నాడు. ‘రాజ్‌కోట్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో యశస్వీ వీరోచిత సెంచరీలో మాకూ భాగముంది. ప్రత్యర్థి జట్లు టెస్టులను వన్డే తరహాలో ఆడడం వెనక ఇంగ్లండ్ ప్రభావం ఉంది. కెప్టెన్ బెన్‌స్టోక్స్, హెడ్‌కోచ్ బ్రెండన్ మెక్కల్లమ్ ఆధ్వర్యంలో ఇంగ్లండ్ జట్టు బజ్ బాల్‌ను మొదలెట్టింది. అగ్రెస్సివ్‌గా ఆడడం ఈ ఆట స్పెషాలిటీ’ అని డకెట్ అన్న విషయం తెలిసిందే.
టెస్టు క్రికెట్లో బజ్‌బాల్(Buzz Ball)తో కొత్త ట్రెండ్ సృష్టించిన ఇంగ్లండ్‌కు యశస్వీ అదిరే కౌంటర్ ఇచ్చాడు. యశ్ బాల్ ఆటతో బెన్ స్టోక్స్(Ben Stokes) సేనకు చుక్కలు చూపించాడు. సిక్సర్ల మోత మోగిస్తూ సుదీర్ఘ ఫార్మాట్లో మూడో సెంచరీ, ఈ సిరీస్‌లో రెండో శతకం ఖాతాలో వేసుకున్నాడు. దాంతో, ఇంగ్లండ్ ఆటగాళ్లతో పాటు కోచ్ బ్రెండన్ మెక్కల్లమ్ సైతం యశస్వీని అభినందించాడు.
ఇంగ్లండ్ సిరీస్‌లో దంచికొట్టిన యశస్వీ టెస్టుల్లో 1,000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ధర్మశాల టెస్టులో షోయబ్ బషీర్ బౌలింగ్‌లో బౌండరీ బాది యశస్వీ ఈ మైలురాయికి చేరువయ్యాడు. దాంతో, తక్కువ ఇన్నింగ్స్‌ల్లోనే వెయ్యి పరుగులు బాదిన రెండో భారత క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు.
అత్యంత చిన్నవయసులోనే టెస్టుల్లో వెయ్యి రన్స్ కొట్టిన యశస్వీ.. మాజీ ఆటగాడు దిలీప్ వెంగ్‌సర్కార్ రికార్డు బ్రేక్ చేశాడు. సచిన్ 19 ఏండ్ల 217 రోజుల్లో వెయ్యి పరుగులు చేసి టాప్‌లో ఉన్నాడు. యశస్వీ 22 ఏండ్ల 70 రోజుల్లో వెయ్యి రన్స్ చేసిన నాలుగో ఆటగాడిగా నిలిచాడు. భారత దిగ్గజం కపిల్ దేవ్ 21 ఏండ్ల 27 రోజుల్లో ఈ ఫీట్ సాధించాడు. అంతేకాదు బ్యాటింగ్ యావరేజ్లోనూ యశస్వీ రికార్డులు బ్రేక్ చేశాడు. వినోద్ కాంబ్లీ 83.33 సగటుతో టాప్‌లో నిలవగా.. యశస్వీ 71.43 సగటుతో మూడో స్థానం దక్కించుకున్నాడు.