Vinesh Phogat : పారిస్ ఒలింపిక్స్‌తో సంచలనంగా మారిన భారత రెజ్లర్ వినేశ్ ఫోగాట్ (Vinesh Phogat) బ్రాండ్ వాల్యూ నాలుగింతలు పెరిగింది. ఇంతకుముందు అంబాసిడర్‌గా రూ.25 లక్షలు తీసుకునే ఆమె విశ్వ క్రీడల తర్వాత ఏకంగా కోటి రూపాయలు డిమాండ్ చేస్తోందట. ఈ విషయాన్ని బుధవారం ఎకనామిక్ టైమ్స్ (Economic Times) తన కథనంలో పేర్కొంది.
‘పారిస్ వెళ్లడానికి ముందు వినేశ్ ఒక బ్రాండ్ ప్రకటనలో నటించేందుకు రూ. 25 లక్షలు అడిగేది. ఇప్పుడు ఆమె తన ఫీజును రూ.75 లక్షల నుంచి రూ.1 కోటికి పెంచింది’ అని తెలిపింది. పారిస్‌లో రజతంతో మెరిసిన నీరజ్ చోప్రా (Neeraj Chopra) బ్రాండ్ ధర కూడా 30 నుంచి 40 శాతానికి పెరిగింది. ప్రస్తుతం అంబాసిడర్‌గా అతడు రూ.330 కోట్లు ఆర్జిస్తున్నాడు.
నీరజ్ చోప్రా, మను భాకర్
విశ్వ క్రీడల్లో రెండు కాంస్యాలతో చరిత్ర సృష్టించన మను భాకర్ (Manu Bhaker) సైతం పలు ప్రకటనలకు ఓకే చెప్పింది. ఆమె ఒక్కో యాడ్‌కు రూ.25 లక్షలు డిమాండ్ చేస్తోందని సమాచారం. ఒలింపిక్స్‌లో పతకం పోయిన బాధతో స్వదేశం వచ్చిన వినేశ్ వీడ్కోలుపై పునరాలోచన చేయనుంది. లాస్ ఏంజెల్స్‌లో పతకమే లక్ష్యంగా ఆమె బరిలోకి దిగే అవకాశముంది. అయితే.. వినేశ్ త్వరలోనే రాజకీయాల్లో(Politics)కి రానుందనే వార్తలు జోరందుకున్నాయి.
పారిస్ ప్రదర్శనతో కోట్లాది మంది మనసులు గెలిచిన వినేశ్.. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో వినేశ్ పోటీ చేయనుందని టాక్. తన సోదరి బబితా ఫొగాట్(Babita Phogat)పై వినేశ్ పోటీ చేస్తుందని మీడియా కథనాలు చెబుతున్నాయి. అయితే.. పొలిటికల్ ఎంట్రీపై ఆమె ఎలాంటి ప్రకటన చేయలేదు.
వినేశ్ ఫొగాట్, బబితా ఫొగాట్
కెరీర్లో మూడో ఒలింపిక్స్ బరిలో నిలిచిన వినేశ్ పతకంపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. 50 కిలోల విభాగంలో అదరగొట్టిన ఆమె అలవోకగా ఫైనల్లో అడుగుపెట్టింది. అయితే.. అనూహ్యంగా ఫైనల్ ఫైట్‌కు ముందు 100 గ్రాముల అదనపు బరువుతో అనర్హతకు గురైంది. ఆ బాధలోనే రెజ్లింగ్‌కు వీడ్కోలు కూడా చెప్పిన వినేశ్ తనపై వేటు సవాల్ చేస్తూ అర్బిట్రేషన్ కోర్టు (CAS)లో అప్పీల్ చేసింది.
క్యూబా బాక్సర్తో పాటు సంయుక్తంగా తనకు రజతం ఇవ్వాలని ఆమె డిమాండ్ చేసింది. కానీ, ఆమె డిమాండ్‌ను కాస్ తోసిపుచ్చింది. విభాగానికి సరిపోయేంత బరువు ఉండడం అనేది అథ్లెట్ల బాధ్యత అని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికీ మినహాయింపులు ఉండవని కాస్ చెప్పింది. వినేశ్ ఫొగాట్ విషయంలోనూ తాము అదే నియమాన్ని అనుసరించామ’ని అర్బిట్రేషన్ కోర్టు తన 24 పేజీల తీర్పులో తెలిపింది.