Adam Gilchrist : ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ ఆడం గిల్‌క్రిస్ట్ (Adam Gilchrist) పేరు వింటే చాలు విధ్వంసక ఇన్నింగ్స్‌లే గుర్తుకొస్తాయి. వికెట్ కీపర్‌గానూ తన ముద్ర వేసిన గిల్‌క్రిస్ట్ తాజాగా టాప్ 3 వికెట్ కీపర్ బ్యాటర్లు ఎవరో చెప్పాడు. భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni) మేటి వికెట్ కీపర్ అని ఆసీస్ లెజెండ్ అభిప్రాయ పడ్డాడు.
‘ఆసీస్ దిగ్గజం రొడ్నీ మార్ష్ (Rodney Marsh) ప్రపంచంలోనే అత్యుత్తమ వికెట్ కీపర్ బ్యాటర్. అతడు నా ఆరాధ్య క్రికెటర్. ఇక ఎంఎస్ ధోనీ కూడా గొప్పవాడే. అతడి ప్రశాంతత నాకు నచ్చుతుంది. మైదానంలో మిస్టర్ కూల్ కెప్టెన్‌గానే ధోనీ ఎన్నో అద్భుతాలు చేశాడు. ఇక మూడో క్రికెటర్ ఎవరంటే.. కుమర సంగక్కర (Kumara Sangakkara). బ్యాటర్‌గా, వికెట్ కీపర్‌గా సంగక్కర ఎంతో స్టయిలిగా కనిపిస్తాడు’ అని గిల్‌క్రిస్ట్ వెల్లడించాడు.
రొడ్నీ మార్ష్
అంతేకాదు నవంబర్‌లో కంగారూల గడ్డపై జరుగబోయే బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ(Border – Gavaskar Trophy)పై కూడా గిల్‌క్రిస్ట్ స్పందించాడు. ఈసారి తమ జట్టు విజేతగా నిలుస్తుందని అతడు జోస్యం పలికాడు. ‘స్వదేశంలో తాము ఎంత శక్తివంతులమో నిరూపించాల్సిన బాధ్యత ఆసీస్‌పై ఉంది.
మరోవైపు భారత జట్టుకు విదేశాల్లో సిరీస్‌లు ఎలా గెలవాలో బాగా తెలుసు. అయితే.. కమిన్స్ సేన సిరీస్ విజేత అవుతుందని నా నమ్మకం. కానీ, ఇరుజట్ల మధ్య తగ్గ పోరు ఉండడం ఖాయం” అని గిల్‌క్రిస్ట్ తెలిపాడు. ఈ ఏడాది నవంబర్ 26వ తేదీన బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ మొదలవ్వనుంది. 2017 నుంచి ఈ ట్రోఫీని గెలుస్తూ వస్తున్న టీమిండియా మళ్లీ ఆస్ట్రేలియాకు చెక్ పెట్టాలనే పట్టుదలతో ఉంది.