AP News | ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై ఏపీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తీవ్రంగా స్పందించారు. 2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీకి 151 సీట్లు కూడా వచ్చాయని గుర్తు చేశారు. అప్పుడు కూడా ట్యాంపరింగ్ చేశారా అని ప్రశ్నించారు. అప్పుడు మీ నాయకుడిని మహానేత అని అన్నారని.. ఇప్పుడు మేం గెలిస్తే విజ్ఞత లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఈవీఎంల గురించి మాట్లాడే అర్హత వైసీపీ నాయకులకు లేదని విమర్శించారు. రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని గౌరవించడం నేర్చుకోవాలని హితవు పలికారు.
జగన్కు కోపం వస్తే కుర్చీ విసిరేస్తాడో, రాయి వేస్తాడో, కొడతాడో అని భయపడి వైసీపీ నేతలు ఏది పడితే అది మాట్లాడుతున్నారని మంత్రి ఆనం విమర్శించారు. పాపం విజయసాయి.. మళ్లీ తిరిగి చూడలేదని.. ఇంకోకాయన దోపిడీ కేసులో ఇరుక్కోబోతున్నారని అన్నారు. నెల్లూరు జిల్లాలో బుధవారం మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడారు. నెల్లూరు జిల్లా ప్రజలకు సోమశిల ప్రాజెక్టు జీవనాడిగా ఉందని అన్నారు.
ప్రభుత్వం ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసిందని ఆనం రామనారాయణ రెడ్డి విమర్శించారు. పోలవరంతో సహా అన్ని ప్రాజెక్టులను గాలికొదిలేసిందని అన్నారు. వర్షాలు, వరదలు వచ్చి సాగునీరంతా సముద్రానికి పోయినా చూస్తూ ఉన్నారే తప్ప.. ఇతర ప్రాంతాలకు ఆ నీటిని తరల్చే ప్రయత్నం చేయలేదని అన్నారు. అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోతే పట్టించుకోలేదని పేర్కొన్నారు. జగన్ అనాలోచిత నిర్ణయాలు రైతులకు గొడ్డలిపెట్టుగా మారాయని అన్నారు.