Badlapur Incident : మహారాష్ట్రలోని బద్లాపూర్ స్కూల్లో చిన్నారులపై లైంగిక వేధింపుల ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనపై విపక్షాలు మహారాష్ట్ర సర్కార్ లక్ష్యంగా తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. బద్లాపూర్ ఘటనపై ఏక్నాథ్ షిండే సారధ్యంలోని మహాయుతి సర్కార్ రాజకీయాలకు తెరలేపిందని మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలె బుధవారం ఆరోపించారు. ఈ ఘటనకు నిరసనగా మహా వికాస్ అఘది (ఎంవీఏ) ఆగస్ట్ 24న మహారాష్ట్ర బంద్కు పిలుపు ఇచ్చిందని ఆయన వెల్లడించారు.
బద్లాపూర్ ఘటనను ప్రభుత్వమే రాజకీయం చేస్తోందని దుయ్యబట్టారు. మహారాష్ట్రలో ఇటీవల మహిళలు, బాలికలు, చిన్నారులపై లైంగిక వేధింపులు పెచ్చుమీరాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో దాదాపు 21000 ఈ తరహా ఘటనలు జరిగితే ప్రభుత్వం మౌనం దాల్చిందని నానా పటోలె మండిపడ్డారు. మరోవైపు మహారాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనను ఖండించిందని, త్వరలోనే నిందితుడిని కఠినంగా శిక్షిస్తుందని శివసేన నేత సంజయ్ నిరుపమ్ పేర్కొన్నారు.
కాగా, మహారాష్ట్రలో మహిళలకు రక్షణ కరవైందని, అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోందని షిండే సర్కార్ను కాంగ్రెస్ నేత అస్లాం షేక్ నిలదీశారు. ఓవైపు లడ్కీ బహిన్ యోజన కింద మహిళలకు ప్రభుత్వం నగదు సాయం అందిస్తుంటే మరోవైపు సీఎం సొంత జిల్లా థానేలో మహిళలపై నేరాలు ఏకంగా 57 శాతం పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్ధితి దిగజారిందని, మహిళలపై నేరాలు పెరిగాయని వ్యాఖ్యానించారు.
Read More :
Cobra | వాషింగ్ మెషీన్లో నాగుపాము ప్రత్యక్షం.. షాకింగ్ వీడియో