IPL 2025 : భారత పురుషుల జట్టు మాజీ బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్ (Vikram Rathour) ఐపీఎల్లో తన మార్క్ చూపించనున్నాడు. ఇప్పుడు కూడా అతడు కోచ్ రాహుల్ ద్రవిడ్(Rahul Dravid)తో కలిసి పనిచేయనున్నాడు. అవును.. రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) బ్యాటింగ్ కోచ్‌గా విక్రమ్ రాథోర్ నియమితులయ్యాడు. టీమిండియాకు టీ20 ట్రోఫీకి అందించిన ఈ ఇద్దరూ ఫ్రాంచైజీ క్రికెట్లో హిట్ కొట్టేందుకు సిద్ధమయ్యారు.
ఈ విషయాన్ని శుక్రవారం రాజస్థాన్ ఫ్రాంచైజీ వెల్లడించింది. ఈమధ్యే ద్రవిడ్‌ను తమ జట్టుకు హెడ్‌కోచ్‌గా ప్రకటించిన విషయం తెలిసిందే. రాజస్థాన్ బ్యాటింగ్ కోచ్‌గా విక్రమ్ నియామకం పట్ల ద్రవిడ్ సంతోషం వ్యక్తం చేశాడు. ‘చాలా ఏడ్లుంగా విక్రమ్‌తో కలిసి పని చేశాను. అతడి సాంకేతిక అనుభవం, ప్రశాంతంగా ఉండే తీరు, భారత పరిస్థితులపై అతడికి ఉన్నఅవగాహన రాజస్థాన్ రాయల్స్‌కు ఎంతో పనికొస్తాయని నమ్మకంగా చెబుతున్నా. కోచింగ్ బృందంగా ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. ఇద్దరం కలిసి టీమిండియా విజయాల్లో భాగమయ్యాం. మరోసారి విక్రమ్‌తో పనిచేసే అవకాశం దక్కినందుకు థ్రిల్‌గా ఫీలవుతున్నా. యువ ఆటగాళ్లకు తర్ఫీదు ఇవ్వడంలో అతడు ఎక్స్పర్ట్’ అని ద్రవిడ్ తెలిపాడు.
Rathour bhi, Royal bhi! 💗
T20 World Cup winning coach Vikram Rathour joins our support staff and reunites with Rahul Dravid! 🤝🔥 pic.twitter.com/YbGvoMQyrv
— Rajasthan Royals (@rajasthanroyals) September 20, 2024
ద్రవిడ్, విక్రమ్ రాథోర్లు తొలిసారి టీమిండియాకు కలిసి పనిచేశారు. రొటేషన్ విధానానికి శ్రీకారం చుట్టి అందరికీ అవకాశాలు కల్పించారు. అంతేకాదు భారత జట్టును వరుసగా మూడు ఐసీసీ ఫైనల్స్‌కు తీసుకెళ్లారు. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (WTC) ఫైనల్ .. ఆ తర్వాత వన్డే వరల్డ్ కప్‌లో రోహిత్ శర్మ బృందం కప్ చేజార్చుకుంది. కానీ, టీ20 వరల్డ్ కప్‌లో ద్రవిడ్ టీమ్ కల ఫలించింది. 17 ఏండ్లుగా ఊరిస్తున్న పొట్టి ప్రపంచ కప్ భారత్ ఖాతాలో చేరింది.
విక్రమ్ రాథోర్, ద్రవిడ్
ఐపీఎల్ తొలి సీజన్(2008) విజేత అయిన రాజస్థాన్ మళ్లీ ట్రోఫీని ముద్దాడింది లేదు. సంజూ శాంసన్(Sanju Samson) కెప్టెన్సీలో ఓసారి ఫైనల్ చేరినా రన్నరప్‌గా నిరాశపరిచింది. దాంతో, ఈసారి టైటిల్ కొట్టడమే లక్ష్యంగా పెట్టుకున్న రాజస్థాన్ కోచింగ్ స్టాఫ్‌ను మార్చేసింది. భారత జట్టును వరల్డ్ కప్ చాంపియన్‌గా నిలిపిన ద్రవిడ్, విక్రమ్‌లను కోరి మరీ తెచ్చుకుంది.