Tirumala | తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం వ్యవహారం దేశవ్యాప్తంగా పెద్ద దుమారం రేపింది. పవిత్రమైన లడ్డూ తయారీలో స్వచ్ఛమైన ఆవు నెయ్యికి బదులు జంతువుల కొవ్వుతో చేసిన నెయ్యిని వాడారనే వార్తలతో భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీ హయాంలో టీటీడీకి నెయ్యి సరఫరా చేసిన తమిళనాడుకు చెందిన ఏఆర్ డెయిరీ యాజమాన్యం స్పందించింది. తాము సరఫరా చేసిన నెయ్యిలో ఎలాంటి కల్తీ జరగలేదని స్పష్టం చేసింది.
తమ డెయిరీ నుంచి జూన్, జూలై నెలల్లో నెయ్యి సరఫరా చేశామని.. ఇప్పుడు టీటీడీకి నెయ్యి సరఫరా చేయడం లేదని ఏఆర్ డెయిరీ యాజమాన్యం తెలిపింది. 25 ఏండ్లుగా తాము డెయిరీ సేవలను అందిస్తున్నామని..దేశవ్యాప్తంగా తమ ఉత్పత్తులను విక్రయిస్తున్నామని, ఎప్పుడూ ఇలాంటి ఆరోపణలు రాలేదని చెప్పింది. తాజాగా తమ సంస్థపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో టీటీడీకి అందించే నెయ్యి నాణ్యత ప్రమాణాలపై టెస్టులు నిర్వహించామని పేర్కొంది. ఆ టెస్టుల్లో నెయ్యిలో ఎలాంటి లోపాలు లేవని తేలిందని చెప్పింది. కానీ తమపై విషప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. టీటీడీ అడిగిన వెంటనే సంబంధిత రిపోర్టును పంపించామని తెలిపింది. కానీ టీటీడీ నుంచి తమకు స్పందన రాలేదని తెలిపింది.
కాగా, తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిన మాట వాస్తవమేనని టీటీడీ ఈవో శ్యామలరావు వెల్లడించారు. లడ్డూ తయారీకి వాడే నెయ్యిలో తాను కూడా నాణ్యతా లోపాన్ని గమనించానని తెలిపారు. అందుకే జూలై 6న నెయ్యిని ఎన్డీడీబీ ల్యాబ్‌కు పంపించామని అన్నారు. ఆ ల్యాబ్ పరీక్షలో నెయ్యి నాణ్యత లేదని, భారీగా కల్తీ జరిగినట్లు నివేదికలు వచ్చాయని చెప్పారు. నెయ్యి నాణ్యత 100 పాయింట్లకు బదులు 20 పాయింట్లే ఉందని అన్నారు. జంతువుల కొవ్వు నెయ్యిలో కలిసినట్లు ఎన్డీడీబీ తేల్చిందని అన్నారు. తమిళనాడుకు చెందిన ఏఆర్ ఫుడ్స్ సరఫరా చేసిన నెయ్యిలో కల్తీ జరిగిందని.. నెయ్యి కల్తీ జరిగిందని తేలిన వెంటనే ఆ సంస్థపై చర్యలకు ఉపక్రమించామని తెలిపారు. ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై కమిటీ వేశామన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు.