ప్రతిష్ఠాత్మక చాంపియన్స్ ట్రోఫీలో భారత్ అపజయమన్నది లేకుండా దూసుకెళుతున్నది. ప్రత్యర్థి ఎవరైనా గెలుపు పక్కా అన్న రీతిలో అదరగొడుతున్నది. బంగ్లాదేశ్, పాకిస్థాన్‌ను ఓడించిన జోరులో బరిలోకి దిగిన టీమ్ఇండియా..న్యూజిలాండ్‌కు ఓటమి రుచి చూపెట్టింది. మెగాటోర్నీల్లో తమకు కొరకరాని కొయ్యగా మారిన కివీస్ రెక్కలు విరుస్తూ అజేయంగా సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. అయ్యర్, అక్షర్, హార్దిక్ రాణింపుతో పోరాడే స్కోరు అందుకున్న టీమ్ఇండియా.. వరుణ్ చక్రవర్తి స్పిన్ మాయాజాలంతో కివీస్‌పై ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. విలియమ్సన్ ఒంటరిపోరాటం జట్టును గెలిపించలేకపోయింది. చాంపియన్స్ ట్రోఫీలో కివీస్‌పై తొలిసారి గెలిచిన భారత్..సెమీస్‌లో ఆసీస్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. దక్షిణాఫ్రికా, కివీస్.. మరో సెమీస్‌లో తలపడుతాయి.
Champions Trophy | దుబాయ్ : చాంపియన్స్ ట్రోఫీలో భారత్ దుమ్మురేపింది. బంగ్లాదేశ్‌తో మొదలైన టీమ్ఇండియా గెలుపు జోరు పాకిస్థాన్, న్యూజిలాండ్‌పైనా కొనసాగింది. ఆదివారం జరిగిన గ్రూపు-‘ఏ’ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో టీమ్ఇండియా 44 పరుగుల తేడాతో కివీస్‌పై ఘన విజయం సాధించింది. తద్వారా చాంపియన్స్ ట్రోఫీలో కివీస్‌పై తొలి గెలుపు నమోదు చేసుకుంది. భారత్ నిర్దేశించిన 250 పరుగుల లక్ష్యఛేదనలో కివీస్ 45.3 ఓవర్లలో 205 పరుగులకు కుప్పకూలింది. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి(5/42) ధాటికి కివీస్ విలవిలలాడింది. కేన్ విలియమ్సన్(81) మినహా మిగతా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోయారు. కుల్దీప్యాదవ్ (2/56)కు రెండు వికెట్లు దక్కాయి. తొలుత శ్రేయాస్ అయ్యర్ (98 బంతుల్లో 79, 4ఫోర్లు, 2సిక్స్‌లు) బాధ్యతాయుత అర్ధసెంచరీకి తోడు అక్షర్‌పటేల్(42), హార్దిక్‌పాండ్యా(45) రాణించడంతో టీమ్ఇండియా 50 ఓవర్లలో 249/9 స్కోరు చేసింది. మ్యాట్ హెన్రీ(5/42) ఐదు వికెట్లతో విజృంభించాడు. ఐదు వికెట్లతో కివీస్ పతనాన్ని శాసించిన వరుణ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది. వన్డేల్లో వరుణ్‌కు ఇది అత్యుత్తమ ప్రదర్శనగా నమోదైంది.
లక్ష్యఛేదనకు దిగిన కివీస్‌కు మెరుగైన శుభారంభం దక్కలేదు. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో భారీ షాట్ ఆడబోయిన రచిన్ రవీంద్ర(6)..అక్షర్ పటేల్ సూపర్ క్యాచ్‌తో తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. తొలి ఎనిమిది ఓవర్లు పేసర్లతో బౌలింగ్ చేయించిన కెప్టెన్ రోహిత్‌శర్మ..స్పిన్నర్ల వైపు మొగ్గడంతో మ్యాచ్ స్వరూపం మారిపోయింది. మెగాటోర్నీలో తొలి మ్యాచ్ ఆడుతున్న వరుణ్..విల్ యంగ్(22)ను క్లీన్‌బౌల్డ్ చేసి వికెట్ల వేటకు తెరతీశాడు. మరో ఎండ్‌లో అక్షర్‌పటేల్ కూడా కివీస్ బ్యాటర్లకు పరీక్ష పెట్టడంతో పరుగుల రాక మందగించింది.
తన అనుభవాన్ని ఉపయోగిస్తూ విలియమ్సన్ సింగిల్స్‌తో స్ట్రైక్ రొటేట్ చేశాడు. విలియమ్సన్కు మరో ఎండ్‌లో సరైన సహకారం లేకపోవడంతో రన్‌రేట్ అంతకంతకూ పెరుగుతూ పోయింది. ఈ క్రమంలో అర్ధసెంచరీ మార్క్ అందుకున్న విలియమ్సన్ దూకుడుగా ఆడే ప్రయత్నం చేశాడు. విరామం లేకుండా స్పినర్లతో దాడి చేయడం టీమ్ఇండియాకు కలిసి వచ్చింది. మిచెల్(93), లాథమ్(14), ఫిలిప్స్(12), బ్రేస్‌వెల్(2)విలియమ్సన్ వరుస విరామాల్లో ఔట్ కావడం కివీస్ గెలుపు అవకాశాలను దెబ్బతీసింది. వరుణ్ బంతిని అర్థం చేసుకోని కివీస్ బ్యాటర్లు మూల్యం చెల్లించుకున్నారు. ఆఖర్లో కెప్టెన్ సాంట్నర్(28) దూకుడగా ఆడే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. వరుణ్‌కు తోడు కుల్దీప్, అక్షర్, జడేజా జతకలువడంతో కివీస్ ఆటలు సాగలేదు.
భారత్: 50 ఓవర్లలో 249/9(అయ్యర్ 79, హార్దిక్ 45, హెన్రీ 5/42, జెమీసన్ 1/31),
న్యూజిలాండ్: 45.3 ఓవర్లలో 205 ఆలౌట్(విలియమ్సన్ 81, సాంట్నర్ 28, వరుణ్ 5/42, కుల్దీప్ 2/56)
1 చాంపియన్స్ ట్రోఫీలో ఒక మ్యాచ్‌లో తొమ్మిది వికెట్లు స్పిన్నర్లు తీయడం ఇదే తొలిసారి. గతంలోపాక్ (8) పేరిటి రికార్డు బద్దలైంది
3 చాంపియన్స్ ట్రోఫీలో ఐదు వికెట్ల తీసిన మూడో భారత బౌలర్‌గా వరుణ్ చక్రవర్తి నిలిచాడు. వెస్టిండీస్‌పై జడేజా, బంగ్లాపై షమీ..వరుణ్ కంటే ముందు వరుసలో ఉన్నారు.
భారత్, న్యూజిలాండ్ మ్యాచ్‌లో ఓ అద్భుతం చోటు చేసుకుంది! టీమ్ఇండియా ఇన్నింగ్స్‌లో మ్యాట్ హెన్రీ ఏడో ఓవర్లో విరాట్ కోహ్లీ కొట్టిన షాట్‌ను పాయింట్లో గ్లెన్ ఫిలిప్స్ పట్టిన క్యాచ్ టోర్నీలోనే హైలెట్‌గా నిలిచింది. బుల్లెట్లా దూసుకెళుతున్న బంతిని ఆమాంతం గాల్లోకి ఎగిరిన ఫిలిప్స్ ఒంటిచేత్తో అందుకున్న తీరు..దక్షిణాఫ్రికా దిగ్గజ ఫీల్డర్ జాంటీ రోడ్స్‌ను గుర్తుకు తెచ్చింది. ఫిలిప్స్ క్యాచ్‌తో అవాక్కయిన కోహ్లీ మూడో వికెట్‌గా వెనుదిరిగాడు. ఫిలిప్స్ సూపర్ క్యాచ్‌పై సోషల్‌మీడియాలో ఫ్యాన్స్ తమదైన రీతిలో ప్రశంసలు కురిపిస్తున్నారు.