దుబాయ్: బ్యాట్ పట్టాడంటే రికార్డులను తిరగరాయడమే పనిగా పెట్టుకున్న బీహార్ బుడతడు వైభవ్ సూర్యవంశీ మరోసారి రెచ్చిపోయాడు. ఏసీసీ మెన్స్ అండర్-19 ఆసియా కప్ (వన్డేటోర్నీ)లో భాగంగా యూఏఈతో శుక్రవారం జరిగిన మ్యాచ్లో వైభవ్.. (95 బంతుల్లో 171, 9 ఫోర్లు, 14 సిక్సర్లు) రికార్డు శతకంతో చెలరేగాడు. ఈ ఐపీఎల్ సంచలనం 56 బంతుల్లోనే శతకం బాదడంతో భారత జట్టు 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 433 పరుగుల రికార్డు స్కోరు చేసింది. ఆరోన్ జార్జి (69), విహాన్ (69) కూడా రాణించారు. రెండో వికెట్కు వైభవ్, ఆరోన్ 146 బంతుల్లోనే 212 రన్స్ జతచేయడం విశేషం. ఛేదనలో యూఏఈ నిర్ణీత ఓవర్లలో 199/7 మాత్రమే చేయడంతో భారత్ 234 పరుగుల భారీ తేడాతో విజయాన్ని అందుకుంది.