నేవి ముంబై: మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)లో యూపీ వారియర్స్ వరుస విజయాల జోరు కొనసాగుతున్నది. శనివారం జరిగిన డబుల్ హెడర్ తొలి పోరులో యూపీ వారియర్స్ 22 పరుగుల తేడాతో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్‌పై అద్భుత విజయం సాధించింది. గత మ్యాచ్‌లోనూ ముంబైని ఓడించిన యూపీ మరోమారు అదే సమష్టి ప్రదర్శన కనబరిచింది. ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో రెండు గెలిచిన యూపీ నాలుగు పాయింట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతుంటే ముంబై(4) రెండో స్థానంలో ఉంది. యూపీ నిర్దేశించిన 188 పరుగుల లక్ష్యఛేదనలో ముంబై 20 ఓవర్లలో 165/6 స్కోరు చేసింది.
యూపీ కట్టుదిట్టమైన బౌలింగ్ ధాటికి ముంబై వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. వెటరన్ బౌలర్ శిఖాపాండే(2/30) మెరుగ్గా రాణించగా, క్రాంతిగౌడ్, ఎకల్‌స్టోన్, దీప్తిశర్మ, ట్రయాన్ ఒక్కో వికెట్ తీశారు. ఛేదనలో ముంబై ఘోరంగా తడబడింది. 69 పరుగులకే ఐదు వికెట్లు చేజార్చుకుని మ్యాచ్‌పై పట్టు కోల్పోయింది. సంజన(10), మాథ్యూస్(13), నాట్‌సీవర్(15), నికోలా క్యారీ(6), కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌కౌర్(18) స్వల్ప స్కోర్లకే పరిమితమయ్యారు. లోయర్ మిడిలార్డర్లో అమెలియా కెర్(49 నాటౌట్), అమన్జ్యోత్కౌర్(41) పోరాడినా లాభం లేకపోయింది. వీరిద్దరు కలిసి ఆరో వికెట్‌కు 83 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే రన్‌రేట్ భారీగా ఉండటంతో ఒత్తిడికి లోనై వికెట్లు చేజార్చుకుంది.
అంతకముందు కెప్టెన్ లానింగ్(45 బంతుల్లో 70, 11ఫోర్లు, 2సిక్స్‌లు), లిచ్‌ఫీల్డ్(37 బంతుల్లో 61, 7ఫోర్లు, 3సిక్స్‌లు) అర్ధసెంచరీలతో యూపీ 20 ఓవర్లలో 187/8 స్కోరు చేసింది. కిరణ్ నవగిరే(0) మరోమారు ఘోరంగా నిరాశపర్చగా, లానింగ్, లిచ్‌ఫీల్డ్ రెండో వికెట్‌కు 119 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. వీరిద్దరికి తోడు హర్లిన్ డియోల్(25), ట్రయాన్(21) రాణించడంతో యూపీ పోరాడే స్కోరు అందుకుంది. మ్యాచ్‌లో ఐదు క్యాచ్‌లు విడిచిపెట్టడం ముంబై కొంపముంచింది. అమెలియా కెర్(3/28)మూడు వికెట్లు తీసింది.
యూపీ: 20 ఓవర్లలో 187/8(లానింగ్ 70, లిచ్‌ఫీల్డ్ 61, అమెలియా 3/28, నాట్ సీవర్ 2/22), ముంబై: 20 ఓవర్లలో 165/6(అమెలియా 49 నాటౌట్, అమన్‌జ్యోత్ 41, శిఖాపాండే 2/30, ట్రయాన్ 1/18)