Karun Nair : టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ అంటే మామూలు విషయం కాదు. సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్ వంటి దిగ్గజాలకు సైతం సాధ్యంకాని ట్రిపుల్ సెంచరీ మార్క్ అందుకున్న రెండో భారత క్రికెటర్ కరుణ్ నాయర్ (Karun Nair). ఈమధ్య రంజీల్లో అద్భుతంగా రాణించిన నాయర్.. తాజాగా మహరాజా టోర్నమెంట్లోనూ శతక గర్జన చేశాడు.
మైసూర్ వారియర్స్ తరఫున మెరుపు సెంచరీ బాదిన కరుణ్.. భారత టెస్టు జట్టులోకి రావడమే తన లక్ష్యమంటున్నాడు. ఈ రైట్ హ్యాండర్ టీమిండియాకు ఆడి ఏడు ఏండ్లు అవుతోంది. అతడికి మళ్లీ ఇండియా జెర్సీ వేసుకొనే చాన్స్ వస్తుందా? లేదా? అనేది చూడాలి. ‘ఒక క్రికెటర్ 30 నుంచి 32 ఏండ్ల మధ్య సూపర్ ఫామ్లో ఉంటాడనే సామెత ఉంది. ఆ మాట నా విషయంలో నిజమవుతుందని నేను నమ్ముతున్నా. గత సీజన్లో నేను ఇంటికే పరిమితం అయ్యాను. చాలా అవకాశాలు మిస్ అయ్యాను. ఆ సమయంలో ఏమీ చేయాలి? అని నన్ను నేను ప్రశ్నించుకున్నా.
ఇప్పుడు అవకాశం రాగానే జట్టుకు ఉపయోగపడే ఇన్నింగ్స్ ఆడాలనుకున్నా. నా కెరీర్లోని గడ్డు రోజులు నన్ను మరింత రాటుదేల్చాయి. ఇప్పుడు నా లక్ష్యం భారత జట్టుకు మళ్లీ ఆడడమే. ఆలోచన పరంగా, ఆట పరంగా నేను మంచి స్థితిలో ఉన్నాను. నాకు ట్రోఫీలు గెలవడం అంటే ఇష్టం. నిరుడు రంజీని మేము కోల్పోయాం. ఈసారి కచ్చితంగా ట్రోఫీ గెలవాలనే పట్టుదలతో ఉన్నాం’ అని కరుణ్ వెల్లడించాడు.
దేశవాళీ క్రికెట్లో కరణ్ ప్రకంపనలు సృష్టించాడు. 2013-14లో అరంగేట్రం చేసిన కరణ్ నాయర్ ఆ ఏడాది రంజీ ట్రోఫీలో ఫైనల్లో 328 పరుగులతో కర్ణాటకను విజేతగా నిలిపాడు. ఆ తర్వాత సీజన్లోనూ నాయర్ రెండు సెంచరీలు, రెండు అర్ధసెంచరీలతో రాణించాడు. సెలెక్టర్ల దృష్టిలో పడ్డ కరణ్ స్వదేశం వేదికగా ఇంగ్లండ్తో జరిగిన టెస్టు సిరీస్కు ఎంపికయ్యాడు.
మొహాలీ టెస్టు (Mohli Test)లో అరంగేట్రం చేసిన కరణ్ ఒకే ఇన్నింగ్స్లో అత్యధిక పరుగులు(303) చేసిన క్రికెటర్గా నిలిచాడు. దీనికి తోడు టెస్టు క్రికెట్ చరిత్రలో తొలి టెస్టులోనే ట్రిపుల్ సెంచరీ చేసిన మూడో క్రికెటర్గా రికార్డుల్లోకెక్కాడు. సెహ్వాగ్ తర్వాత భారత్ తరఫున టెస్టుల్లో త్రిశతకం చేసిన రెండో క్రికెటర్గా కరణ్ నిలిచాడు.