Kolusu Parthasarathy | మైలవరం ఇళ్ల స్థలాల విషయంలో ఇబ్బందులు ఉన్నాయని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. గత ప్రభుత్వం నిర్ణయించిన స్థలాలు నివాసయోగ్యంగా లేవని తెలిపారు. కొన్ని చోట్ల వరదలు వచ్చే పరిస్థితి ఉందని పేర్కొన్నారు. గృహ నిర్మాణ శాఖపై మంగళవారం నాడు మంత్రి పార్థసారథి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత ప్రభుత్వ రాజకీయ కక్ష కారణంగా జనం ఇబ్బంది పడ్డారని తెలిపారు.
గృహ నిర్మాణంలో మట్టి కోసం కొత్త విధానాన్ని ఆలోచించామని కొలుసు పార్థసారథి తెలిపారు. గృహ నిర్మాణంలో మట్టికి బదులు ఫ్లైయాష్ వినియోగించారని చెప్పారు. 2014-19 గృహ నిర్మాణాలపై కొన్ని ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయని అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నిర్ణయం మేరకు 2014-19 నాటి గృహాలకు కూడా డబ్బు చెల్లిస్తామని తెలిపారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో క్వాలిటీ చెక్ కూడా పూర్తిగా చేస్తున్నామని పేర్కొన్నారు. లబ్ధిదారులను నష్టపరిచిన వారిపై కచ్చితంగా చర్యలు ఉంటాయని అన్నారు. లబ్ధిదారులు రుణం పొంది కూడా నిర్మాణం చేయకపోతే.. భవిష్యత్తులో ఇబ్బంది పడతారని తెలిపారు. స్థానిక అధికారులు, ఎమ్మెల్యేలు లబ్ధిదారుల సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలని పేర్కొన్నారు. కేంద్రం ఇళ్ల నిర్మాణానికి 1.5 లక్షలు మాత్రమే ఇస్తుందని తమకు తెలిసిందని.. గృహ నిర్మాణం అత్యంత ముఖ్యమైన అంశమని సీఎం చంద్రబాబు తెలిపారు. వందరోజుల్లో 1.20 లక్షల ఇళ్లు, రాబోయే రోజుల్లో 7 లక్షల ఇళ్లను నిర్మించడమే తమ టార్గెట్ అని పేర్కొన్నారు.