ఢిల్లీ: మరో నెలరోజుల్లో మొదలుకానున్న టీ20 ప్రపంచకప్‌నకు ముందు భారత జట్టుకు ఎదురుదెబ్బ. ఇటీవల నిలకడగా రాణిస్తున్న యువ బ్యాటర్ తిలక్ వర్మ అనారోగ్యానికి గురవడంతో హుటాహుటిన అతడికి శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది. విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా రాజ్‌కోట్‌లో ఉండగా వృషణాల్లో తీవ్రమైన నొప్పి రావడంతో అతడిని దగ్గర్లోనే ఉన్న దవాఖానాకు తరలించి వైద్య పరీక్షలు చేయించగా డాక్టర్లు అతడికి సర్జరీ అవసరమని తేల్చడంతో బీసీసీఐ అందుకు సమ్మతించింది.
కనీసం నాలుగువారాల పాటు అతడికి విశ్రాంతి అవసరమని వైద్యులు చెప్పారు. తిలక్ ఆరోగ్యం నిలకడగానే ఉందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. అయితే శస్త్రచికిత్స కారణంగా ఈనెల 21 నుంచి సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో జరిగే మొదటి మూడు మ్యాచ్‌లకు ఈ హైదరాబాదీ బ్యాటర్ దూరమయ్యాడు. ప్రపంచకప్‌లోనూ ప్రారంభ మ్యాచ్‌లకు అతడు ఆడటం అనుమానమేనని బోర్డు వర్గాల సమాచారం.