హైదరాబాద్, ఆట ప్రతినిధి : ఆసియా కప్ ఫైనల్లో పాకిస్థాన్ ఆటగాళ్లు తమపై స్లెడ్జింగ్‌కు దిగినా వారికి విజయంతోనే బుద్ధి చెప్పామని భారత క్రికెటర్ తిలక్ వర్మ అన్నాడు. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో బ్యాటింగ్‌కు వచ్చి అసాధారణ బ్యాటింగ్‌తో భారత జట్టుకు తొమ్మిదో ఆసియా కప్‌ను అందించడంలో కీలకపాత్ర పోషించిన ఈ హైదరాబాదీ కుర్రాడు.. మంగళవారం నగరంలోని లింగంపల్లిలో ఉన్న లెగాల క్రికెట్ అకాడమీలో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. తిలక్ మాట్లాడుతూ.. ‘ఛేదనలో మా జట్టు 20 రన్స్‌కే 3 కీలక వికెట్లు కోల్పోయిన దశలో మేం కాస్త ఒత్తిడికి గురయ్యాం. అదే అదునుగా పాక్ క్రికెటర్లు మాపై స్లెడ్జింగ్‌కు దిగారు. ఆ సమయంలో నేను ఉద్రేకానికి గురికాలేదు. నాకు నా దేశాన్ని గెలిపించడమే ముఖ్యం.
అందుకే సంయమనంగా ఆడి గెలిచాక విజయంతోనే వారికి సమాధానం ఇవ్వాలని భావించా. ఒకవేళ నేను కూడా ఏదైనా పొరపాటు చేస్తే నన్ను మాత్రమే కాకుండా 140 కోట్ల మంది ప్రజలను నిరాశపరుస్తాననే భయంతో ఎక్కడా తడబడకుండా చివరిదాకా క్రీజులో ఉండి మ్యాచ్ గెలిపించాలి అనుకున్నాను’ అని చెప్పాడు. ఆసియా కప్ తర్వాత తన దృష్టంతా వచ్చే ఏడాది స్వదేశంలో జరిగే టీ20 ప్రపంచకప్ మీదే ఉందని, టీమ్ఇండియాకు వరల్డ్ కప్‌ను అందించడమే తన లక్ష్యమని తిలక్ తెలిపాడు. తాను గతంలో చేసిన రెండు సెంచరీలతో పోలిస్తే ఆసియా కప్ ఫైనల్లో ఆడిన ఇన్నింగ్సే బెస్ట్ అని తిలక్ అన్నాడు. ఈ సందర్భంగా తన చిన్ననాటి కోచ్ సలాం బయాష్, పృథ్వీకి తిలక్ కృతజ్ఞతలు తెలిపాడు. తల్లిదండ్రులు, కోచ్‌ల వల్లే తాను ఈ స్థాయికి రాగలిగానని చెప్పాడు.
ఆసియా కప్‌లో భారత్‌ను గెలిపించిన తిలక్ వర్మ మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం.. తిలక్‌ను అభినందించి శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో క్రీడా శాఖ మంత్రి వాకాటి శ్రీహరి, శాట్స్ చైర్మన్ శివసేనా రెడ్డి, శాట్స్ ఎండీ సోనీబాలాదేవి తదితరులు పాల్గొన్నారు.