PKL 2023 : సొంత గడ్డపై వరల్డ్ కప్ పోటీలను ఎంజాయ్ చేసిన క్రీడాభిమానులను అలరించేందుకు ప్రో కబడ్డీ లీగ్(PKL) సిద్ధమవుతోంది. మట్టిలో పుట్టిన ఆటను మ్యాట్‌పై తెచ్చిన పీకేఎల్ పదో సీజన్‌కు వేళైంది. డిసెంబర్ 2 నుంచి ఎక్కడచూసినా కబడ్డీ..కబడ్డీ కూత వినిపించనుంది. టోర్నీకి సమయం దగ్గరపడడంతో మాజీ చాంపియన్ యూపీ యోధ(UP Yoddha) జట్టు కొత్త కెప్టెన్‌ను ప్రకటించింది.
మూడుసార్లు పీకేఎల్ టైటిల్ విజేత పర్దీప్ నర్వాల్( Pardeep Narwal) యూపీ సారథిగా ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని ఆదివారం మేనేజ్మెంట్ వెల్లడించింది. ‘కెప్టెన్‌గా ఎంపికవ్వడంతో నా బాధ్యత మరింత పెరిగింది. సారథిగా నేనేంటో నిరూపించుకునేందుకు, శక్తిసామర్థ్యాలను చాటేందుకు ప్రయత్నిస్తాను’ అని పర్దీప్ తెలిపాడు. పీకేఎల్ చరిత్రలోనే టాప్ రైడర్ అయిన పర్దీప్ ఖాతాలో 1,500 రైడ్ పాయింట్లు ఉన్నాయి. యూపీ 2017లో తొలిసారి చాంపియన్‌గా అవతరించింది. అయితే.. ఆ తర్వాత కనీసం ప్లే ఆఫ్స్ చేరలేకపోయింది. పదో సీజన్లో ఆరంభ పోరులో యూపీ యోధ డిసెంబర్ 2న యూ ముంబాతో తలపడనుంది.