SL vs BAN : సొంత గడ్డపై శ్రీలంక చెలరేగిపోతోంది. ఇప్పటికే టెస్టు, వన్డే సిరీస్ కైవసం చేసుకున్న ఆతిథ్య జట్టు పొట్టి సిరీస్‌ను విజయంతో ఆరంభించింది. పల్లెకెలె స్టేడియంలో గురువారం జరిగిన తొలి పోరులో బంగ్లాదేశ్‌పై లంక 7 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. స్పిన్నర్ థీక్షణ(2-37) ప్రత్యర్థిని దెబ్బకొట్టగా.. కుశాల్ మెండిస్(73) సూపర్ హాఫ్ సెంచరీతో జట్టును గెలిపించాడు. దాంతో, లంక మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
వన్డే సిరీస్ గెలిచిన ఉత్సాహంలో ఉన్న శ్రీలంక టీ20 సిరీస్‌ను విజయంతో మొదలుపెట్టింది. బంగ్లాదేశ్‌ను తక్కువకే కట్టడి చేసిన చరిత అలసంక బృందం స్వల్ప ఛేదనను ధాటిగా ఆరంభించింది. ఓపెనర్లు పథుమ్ నిశాంక(42) మెరుపు బ్యాటింగ్‌కు కుశాల్ మెండిస్(73) మెరుపులు తోడవ్వడంతో వేగంగా లక్ష్యానికి చేరువైంది.
Sri Lanka go 1-0 up in the T20I series!#SLvBAN scorecard 👉 https://t.co/1gDGq9HoZ9 pic.twitter.com/ch9p5zdHPy
— ESPNcricinfo (@ESPNcricinfo) July 10, 2025
ఈ ఇద్దరు ఔటయ్యాక అవిష్క ఫెర్నాండో తో కలిసి కెప్టెన్ అసలంక విరుచుకుపడ్డాడు. వీరిద్దరి జోరుతో మరో ఓవర్ ఉండగానే ఊదిపడేసింది లంక. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ భారీ స్కోర్ చేయలేకపోయింది. టాపార్డర్‌లో పర్వేజ్ హొసేన్ (38), తంజిద్ హసన్(16)లు రాణించినా మిడిలార్డర్‌ను థీక్షణ, వాండర్సే క్రీజులో నిలువనీయలేదు. దాంతో, బంగ్లా నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి154 పరుగులు మాత్రమే చేసింది. ఇరుజట్ల మధ్య రెండో టీ20 జూలై 13న జరుగనుంది.