Wimbledon : తొలి రౌండ్ నుంచి టాప్ సీడ్ల నిష్క్రమణతో ఆసక్తిగా మారిన వింబుల్డన్ (Wimbledon)లో మరో సంచలనం. ఈసారి టాప్ సీడ్, వరల్డ్ నంబర్ 1 అరీనా సబలెంకా (Aryna Sabalenka)కు షాక్ తగిలింది. గురువారం జరిగిన సెమీఫైనల్లో అమెరికా సంచలనం అమందా అనిసిమోవా చేతిలో సబలెంకా ఓటమి పాలైంది. సెంటర్ కోర్టులో 13వ సీడ్ అమందా ధాటికి బెలాసర్ భామ చేతులెత్తేసింది.
భారీ అంచనాల నడుమ కోర్టులో అడుగుపెట్టిన సబలెంకాకు అమందా ఆదిలోనే షాకిచ్చింది. తొలి సెట్‌ను 6-4తో కోల్పోయిన ఆమె రెండో సెట్ గెలుపొంది ఆశలు రేపింది. కానీ, నిర్ణయాత్మక మూడో సెట్లో అమందా టాప్ గేర్‌లో ఆడి సబలెంకాను మట్టికరిపించింది. అద్భుత విజయంతో తొలిసారి గ్రాండ్‌స్లామ్ ఫైనల్‌కు దూసుకెళ్లిందీ అమెరికా సంచలనం. టైటిల్ కోసం రెండో సెమీఫైనల్లో తలపడుతున్న ఇగా స్వియాటెక్, బెలిండా బెన్సిక్లలో ఒకరిని ఢీకొననుంది.
The moment Amanda Anisimova became a #Wimbledon finalist for the first time ✨ pic.twitter.com/tUBSsFCaoZ
— Wimbledon (@Wimbledon) July 10, 2025
సబలెంకాను చిత్తు చేసి వింబుల్డన్ ఫైనల్ చేరిన అమందా నెట్టింట ట్రెండింగ్‌లో ఉంది. న్యూ జెర్సీలో జన్మించిన ఆమందా ఫ్లొరిడాలో పెరిగింది. టీనేజ్ నుంచి టెన్నిస్‌పై ఇష్టం పెంచుకున్న ఆమె 17 ఏళ్ల వయసులోనే సంచలన విజయాలతో వార్తల్లో నిలిచింది. 2019 ఫ్రెంచ్ ఓపెన్ సెమీ ఫైనల్ వరకూ వెళ్లిన అమందా భవిష్యత్ స్టార్‌గా ప్రశంసలందుకుంది.
అయితే.. అనుకోకుండా మానసిక ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఏడాది విరామం తీసుకుంది. అయినా సరే ఆమె రాకెట్‌ను మాత్రం వదల్లేదు. గడ్డు రోజుల్ని దాటి వచ్చిన అమందా వింబుల్డన్‌లో టాప్ సీడ్‌ను ఇంటికి పంపి ఫైనల్ చేరడం మామూలు విషయం కాదు. ‘సబలెంక నాకు స్ఫూర్తి. నా ఒక్కదానికే కాదు చాలామందికి ఆమె రోల్‌మోడల్. ఈ విజయాన్ని ఎలా వర్ణించాలో నాకు మాటలు రావడం లేద’ని అంటోందీ అమెరికన్.