కాజీపేట, జనవరి 11: హనుమకొండ జిల్లాలోని కాజీపేట రైల్వే స్టేడియంలో ఆదివారం సాయంత్రం 58వ జాతీయ స్థాయి సీనియర్ ఖోఖో చాంపియన్షిప్ పోటీలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర ఖోఖో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఐదు రోజుల పాటు నిర్వహించనున్న ఈ పోటీలను రాష్ట్ర క్రీడలు, రాష్ట్ర నీటిపారుదల శాఖల మంత్రులు వాకిటి శ్రీహరి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా శ్రీహరి మాట్లాడుతూ రాష్ట్ర ఖోఖో అసోసియేషన్ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి అభ్యర్థన మేరకు వరంగల్ ఇండోర్ మైదానంలో ఖోఖో స్టేడియానికి కోటిన్నర రూపాయల నిధులను మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ క్రీడలకు తమ ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందన్నారు. ఖోఖో పోటీల్లో పాల్గొనేందుకు వివిధ రాష్ర్టాల నుంచి 1406 క్రీడాకారులు హాజరయ్యారు.