బ్రిడ్జ్‌టౌన్(బార్బడోస్): టీ20 ప్రపంచకప్‌లో ఆతిథ్య వెస్టిండీస్ అదరగొట్టింది. సొంతగడ్డపై ముచ్చటగా మూడోసారి మెగాటోర్నీని ముద్దాడాలని చూస్తున్న విండీస్..ఆ దిశగా దూసుకెళుతున్నది. ఇంగ్లండ్ చేతిలో ఓటమి నుంచి త్వరగానే తేరుకున్న విండీస్..టోర్నీలో ముందంజ వేయాలంటే తప్పక గెలువాల్సిన మ్యాచ్‌లో సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటింది.
శనివారం సూపర్-8లో భాగంగా యూఎస్ఏతో జరిగిన పోరులో విండీస్ 9 వికెట్ల తేడాతో(55 బంతులు మిగిలుండగానే) భారీ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. దీంతో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఒక గెలుపు, ఒక ఓటమితో విండీస్ ప్రస్తుతం రెండో స్థానంలో కొనసాగుతున్నది. మ్యాచ్ విషయానికొస్తే..యూఎస్ఏ నిర్దేశించిన 129 పరుగుల స్వల్ప లక్ష్యఛేదనలో విండీస్ 10.5 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 130 పరుగులు చేసింది. ఓపెనర్ షాయ్ హోప్(39 బంతుల్లో 82 నాటౌట్, 4ఫోర్లు, 8సిక్స్‌లు) ధనాధన్ అర్ధసెంచరీతో కదంతొక్కాడు.
యూఎస్ఏ బౌలర్లను చీల్చిచెండాడుతూ హోప్ బౌండరీల వర్షం కురిపించాడు. తొలి వికెట్‌కు జాసన్ చార్లెస్(15)తో కలిసి 67 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన హోప్..నికోలస్ పూరన్(27 నాటౌట్)తో కలిసి గెలుపు లాంఛనాన్ని పూర్తి చేశాడు. తన ఇన్నింగ్స్‌లో 4ఫోర్లు, 8 భారీ సిక్స్‌లు బాదిన హోప్..జట్టు విజయంలో కీలకమయ్యాడు. హర్మీత్‌సింగ్(1/18)కు ఒక వికెట్ దక్కింది. తొలుత రోస్టన్ చేస్(3/19), రస్సెల్(3/31) ధాటికి యూఎస్ఏ 19.5 ఓవర్లలో 128 పరుగులకు కుప్పకూలింది. విండీస్ బౌలర్ల ధాటికి యూఎస్ఏ బ్యాటర్లు క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు. గౌస్(29), నితీశ్‌కుమార్(20) ఆకట్టుకున్నారు. మూడు వికెట్లు తీసిన చేస్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.