హైదరాబాద్, సెప్టెంబర్11, (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) సొంత నిబంధనల ప్రకారం అకౌంట్ నిర్వహించేందుకు అనుమతించాలని బ్యాంకుకు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. పాలక మండలి గుర్తించి ఇద్దరు అధీకృత అధికారుల వివరాలను తీసుకుని అసోసియేషన్ ఖాతా నిర్వహణకు అనుమతి ఇవ్వాలని బ్యాంకుకు ఆదేశించింది. హెచ్‌సీఏలో అక్రమాలు,అవకతవకలపై క్రిమినల్ కేసునమోదు కావడంతో సీఐడీ ఆదేశాలతో అసోసియేషన్ బ్యాంక్ అకౌంట్ స్తంభింపజేయడాన్ని అసోసియేషన్ సవాల్ చేసిన పిటిషన్‌ను గురువారం జస్టిస్ ఎన్.వి.శ్రవణ్‌కుమార్ విచారించారు.
కెనరా బ్యాంకులో ఉన్న అసోసియేషన్ ఖాతాను సీఐడీ స్తంభింపజేసిందని, ఇందుకు ఏ విధమైన కారణాలు పేరొలేదని పిటిషనర్ న్యాయవాది చెప్పారు. సీఐడీ కేసుకు అసోసియేషన్‌కు ఏ సంబంధం లేదన్నారు. హెచ్‌సీఏ పాలకవర్గ వ్యక్తులపై సీఐడీ కేసు పెట్టిందన్నారు. అకౌంట్ లావాదేవీలు నిలిచిపోవడంతో చెల్లింపులు ఆగిపోయాయని చెప్పారు. దీనిపై ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ అసోసియేషన్ రూల్స్ ప్రకారం బ్యాంక్ అకౌంట్ నిర్వహించుకునే వీలుందన్నారు. వాదనల తర్వాత హైకోర్టు, అసోసియేషన్ పాలకవర్గం గుర్తించిన ఇద్దరి గుర్తింపు వివరాలను తీసుకుని ఖాతా నిర్వహణకు అనుమతించాలని బ్యాంకుకు ఆదేశాలు జారీ చేసింది.