ముంబై: ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్‌కు బీసీసీఐ..భారత క్రికెట్ జట్టును ఆదివారం ప్రకటించింది. అజిత్ అగార్కర్ నేతృత్వంలో సమావేశమైన సీనియర్ సెలెక్షన్ కమిటీ 15 మందితో జట్టును ఎంపిక చేసింది. అఫ్గానిస్థాన్‌తో తాజాగా ముగిసిన వన్డే సిరీస్‌లో ఆకట్టుకున్న యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌కు చుక్కెదురు కాగా, స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తిరిగి జట్టుకు ఎంపికయ్యాడు. అఫ్గన్‌తో ఆఖరి వన్డేలో ధనాధన్ సెంచరీతో జట్టు విజయంలో కీలకంగా వ్యవహరించిన జైస్వాల్‌కు సెలెక్టర్ల నుంచి మొండిచేయి ఎదురైంది. ఐపీఎల్ సందర్భంగా గాయపడ్డ కోహ్లీ..ఈ వారంలో బెంగళూరు సీవోఈలో ఫిట్నెస్ పరీక్షలో పాస్ కావాల్సి ఉంది.
వచ్చే ఏడాది జరిగే వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకున్న సెలెక్టర్లు అందుకు తగ్గట్లు కోర్‌టీమ్‌ను ఎంపిక చేశారు. 2023 వన్డే వరల్డ్‌కప్ నుంచి దూరంగా ఉంటున్న సీనియర్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా..ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు చోటు దక్కించుకున్నాడు. మరోవైపు అక్షర్‌పటేల్ తిరిగి జట్టులోకి రాగా, ఇటీవలే అరంగేట్రం చేసిన ప్రిన్స్‌యాదవ్, హర్ష్‌దూబేకు నిరాశే ఎదురైంది. స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్‌పాండ్యా బెర్తు ఖాయం కాగా, తెలుగు క్రికెటర్ నితీశ్‌కుమార్‌రెడ్డి చోటు నిలుపుకొన్నాడు. జూలై 14, 16, 19 తేదీల్లో భారత్, ఇంగ్లండ్ వన్డే సిరీస్ జరుగనున్నది.
జట్టు వివరాలు: గిల్(కెప్టెన్), రోహిత్‌శర్మ, కోహ్లీ (ఫిట్నెస్ పరీక్షను అనుసరించి), అయ్యర్(వైస్ కెప్టెన్), రాహుల్, కిషన్, సుందర్, అక్షర్, నితీశ్‌కుమార్, కుల్దీప్, బుమ్రా, ప్రసిద్, రానా, అర్ష్‌దీప్, గుర్నుర్ బ్రార్.