దుబాయ్: క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. ప్రతిష్టాత్మక టీ20 ప్రపంచకప్ టోర్నీకి సన్నాహకంగా భావిస్తున్న ఆసియాకప్‌నకు మంగళవారం తెరలేవనుంది. ఎనిమిది జట్ల సమాహారంతో యూఏఈ వేదికగా జరుగనున్న ఆసియాకప్ అభిమానులను అలరించడం ఖాయంగా కనిపిస్తున్నది. ఎనిమిది సార్లు విజేత, డిఫెండింగ్ చాంపియన్ టీమ్ఇండియా టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతుండగా, చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఒమన్, యూఏఈ, అఫ్గానిస్థాన్, హాంకాంగ్ పోటీలో ఉన్నాయి. అఫ్గానిస్థాన్, హాంకాంగ్ మధ్య అబుదాబి వేదికగా మ్యాచ్‌తో ఆసియా టోర్నీ అట్టహాసంగా మొదలుకానుంది. వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం భారత్‌లో ఆసియా కప్ జరుగాల్సి ఉన్నా.. పాకిస్థాన్‌తో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో వేదికను యూఏఈకి బదిలీ చేశారు.
ఇదిలా ఉంటే సెప్టెంబర్‌లో ఏడారి నగరంలో ఉన్న వేడి ఉష్ణోగ్రతలను దృష్టిలో పెట్టుకుని నిర్ణీత సమయం కంటే అర్ధగంట ఆలస్యంగా 8గంటలకు(భారత కాలమానం ప్రకారం) మొదలుకానున్నాయి. వచ్చే ఏడాది భారత్, శ్రీలంకలో జరిగే టీ20 ప్రపంచకప్ దృష్ట్యా ఈసారి ఆసియా టోర్నీని పొట్టిఫార్మాట్లో నిర్వహిస్తున్నారు. దిగ్గజ క్రికెటర్లు విరాట్‌కోహ్లీ, రోహిత్‌శర్మ రిటైర్మెంట్ తర్వాత టీమ్ఇండియా తొలిసారి ఆసియాకప్‌లో ఆడబోతున్నది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో భారత్ బలంగా కనిపిస్తున్నది. ఐపీఎల్లో మెరుపులు మెరిపించిన యువ క్రికెటర్లకు పెద్దపీట వేసిన బీసీసీఐ భారీ మార్పుల్లేకుండానే 17 మందితో కాకుండా 15 మందితో జట్టును ప్రకటించింది. ఐపీఎల్లో అదరగొట్టిన శ్రేయాస్ అయ్యర్, యశస్వి జైస్వాల్‌ను పక్కకుపెట్టిన బీసీసీఐ సెలెక్టర్లు కోర్‌టీమ్‌కు మొగ్గుచూపారు
ఆసియా కప్ టోర్నీలో టీమ్ఇండియా హాట్ ఫేవరెట్‌గా కనిపిస్తున్నది. రోహిత్ తర్వాత టీ20 పగ్గాలు అందుకున్న ముంబైకర్ సూర్యకుమార్ నాయకత్వంలో టీమ్ఇండియా వరుస విజయాలతో దుమ్మురేపుతున్నది. భవిష్యత్ కెప్టెన్‌గా భావిస్తున్న శుభ్‌మన్ గిల్ చేరికతో టీమ్ఇండియా మరింత బలం పుంజుకోగా, సీనియర్ వికెట్‌కీపర్, బ్యాటర్ సంజూ శాంసన్ స్థానంపై సందిగ్ధత నెలకొన్నది. గత కొన్ని రోజులుగా నెట్స్ సెషన్లో హార్డ్‌హిట్టింగ్ కీపర్ జితేశ్శర్మ ప్రాక్టీస్ చేస్తుండటం దీనికి మరింత బలం చేకూరుస్తున్నది.
ఓపెనర్లుగా అభిషేక్‌శర్మ, గిల్ దాదాపు ఖాయం కాగా, మూడో స్థానంలో హైదరాబాదీ తిలక్‌వర్మ స్థానానికి ప్రస్తుతానికి ఢోకా లేదు. ఆ తర్వాత కెప్టెన్ సూర్యకుమార్, హార్దిక్‌పాండ్యా, రింకూసింగ్, జితేశ్శర్మ, శివమ్ దూబే, అక్షర్‌పటేల్‌తో పటిష్టంగా కనిపిస్తున్నది.బుమ్రా చేరికతో పేస్ దళం పదునెక్కగా, అర్ష్‌దీప్‌సింగ్, హర్షిత్రానా తలో చేయి వేయనున్నారు.సల్మాన్ ఆగా కెప్టెన్సీలో పాక్ పోటీకి దిగుతుండగా, శ్రీలంక, అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి.
సెప్టెంబర్ 10: భారత్ X యూఏఈ
సెప్టెంబర్ 14: భారత్ X పాకిస్థాన్
సెప్టెంబర్ 19: భారత్ X ఒమన్