శనివారం నుంచి ప్రారంభం కాబోయే ఐపీఎల్లో ఇది 18వ సీజన్. గడిచిన 17 సీజన్లలో తాము ఆడిన 15 సీజన్ల (2016, 2017లో రెండేండ్లు నిషేధం)లో ఐదు ట్రోఫీలు గెలవడం ఒకెత్తు అయితే ఈ టోర్నీలో ఏకంగా పదిసార్లు ఫైనల్ ఆడిన జట్టు ఏదైనా ఉందా? అంటే అది చెన్నై సూపర్ కింగ్స్ మాత్రమే. 2010, 2011, 2018, 2021, 2023లో టైటిళ్లు సాధించిన సీఎస్కే.. 2008, 2012, 2013, 2015, 2019లో రన్నరప్‌గా నిలిచింది. ఆడిన 15 సీజన్లలో 2020, 2022, 2024లో మినహాయిస్తే ఆ జట్టు ప్లేఆఫ్స్‌కు వెళ్లకుండా సీజన్‌ను ముగించలేదంటే ఆ జట్టు ఎంత నిలకడగా ఆడుతుందో అర్థం చేసుకోవచ్చు. భారత జట్టుకు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన దిగ్గజ సారథి మహేంద్రసింగ్ ధోనీ సారథ్యంలో టోర్నీలోనే అత్యంత విజయవంతమైన జట్టుగా రికార్డులకెక్కిన చెన్నై.. గత సీజన్లో కొత్త సారథి రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీలో విఫలమైంది. నిరుటి సీజన్లో విఫలమైనప్పటికీ 2025లో మాత్రం సత్తా చాటి ఆరో టైటిల్‌ను దక్కించుకోవాలని సీఎస్కే పట్టుదలతో ఉంది.
ఈ సీజన్లో మరే జట్టుకూ లేని పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ మాత్రమే గాక ఉన్నవారిలో అధికంగా ఆల్‌రౌండర్లు ఉండటం చెన్నై సొంతం. రచిన్ రవీంద్ర, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వేకు రాహుల్ త్రిపాఠి జతకలవడం ఆ జట్టు బ్యాటింగ్ బలాన్ని మరింత పెంచింది. మిడిలార్డర్లో సిక్సర్ల వీరుడు శివమ్ దూబే, పేస్ ఆల్‌రౌండర్ సామ్ కరన్‌తో పాటు ఫినిషర్లుగా ధోనీ, జడ్డూ ఉండనే ఉన్నారు. దీపక్ హుడా, విజయ్ శంకర్ వంటి నాణ్యమైన ఆల్‌రౌండర్లతో చెన్నై బెంచ్ బలంగా ఉంది. చాలాకాలం తర్వాత అశ్విన్ కూడా సీఎస్కేతో చేరడంతో ఆ జట్టు బలం మరింత పెరిగింది. బంతి గింగిరాలు తిరిగే చిదంబరం స్టేడియంలో అశ్విన్‌ను ఎదుర్కోవడం ప్రత్యర్థులకు శక్తికి మించిన పనే. అశ్విన్‌కు అండగా 20 ఏండ్ల అఫ్గాన్ స్పిన్నర్ నూర్ అహ్మద్ మిడిల్ ఓవర్లలో చెన్నైకి కీలకం కానున్నాడు. జెమీ ఓవర్టన్, ఖలీల్ అహ్మద్, మతీశ పతిరాన, ముకేశ్ చౌదరి వంటి పేసర్లతో చెన్నై పేస్ విభాగం సైతం సమతుల్యంగానే ఉంది.
2020లో అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు వీడ్కోలు పలికిన తర్వాత ఐపీఎల్ మాత్రమే ఆడుతున్న ధోనీ.. గత మూడు సీజన్లుగా వస్తున్న ఊహాగానాలకు చెక్ పెడుతూ చెన్నైలో కొనసాగుతున్నాడు. సారథ్య పగ్గాలు రుతురాజ్‌కు అప్పజెప్పినా ఇప్పటికీ అతడు అనధికారిక సారథే. గాయాలు, ఫిట్నెస్ ఇతరత్రా కారణాల రీత్యా ధోనీ ఈ సీజన్‌తో ముగిస్తాడని మళ్లీ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి ధోనీ మనసులో ఏముందో?
ఐపీఎల్ ఆరంభ సీజన్ నుంచి ఈ లీగ్‌లో ఉండి నిలకడగా ఆడుతున్న మరో దిగ్గజ జట్టు ముంబై ఇండియన్స్. చెన్నై మాదిరిగానే ఐదు టైటిల్స్ సొంతం చేసుకున్న ముంబైదీ ఈ టోర్నీలో ఘనచరిత్రే. తొలి రెండు సీజన్లలో లీగ్ దశకే పరిమితమైన ఆ జట్టు 2010లో రన్నరప్‌గా నిలిచింది. రోహిత్ శర్మ రాకతో 2013లో టైటిల్ వేటను ప్రారంభించింది. 2015, 2017, 2019, 2020లో చాంపియన్‌గా నిలిచింది. కానీ ఆ తర్వాత ముంబై గాడి తప్పింది. గత సీజన్లో అట్టడుగు స్థానం లో నిలిచిన ముంబై.. ఈ సీజన్లో మాత్రం పుంజుకుని మళ్లీ చాంపియన్‌గా నిలవాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది.
2024 సీజన్‌కు ముందు ముంబై.. రోహిత్‌ను కాదని హార్దిక్ పాండ్యాను సారథిగా నియమించడం వివాదాలకు కేంద్ర బిందువైంది. హార్దిక్‌కు యాజమాన్యం మద్దతు ఉన్నా వాంఖడేతో పాటు ముంబై ఎక్కడ మ్యాచ్‌లు ఆడినా అతడికి ఛీత్కారాలే ఎదురయ్యాయి. అదీగాక హార్దిక్, రోహిత్ మధ్య విబేధాలు ఉన్నాయని, డ్రెస్సింగ్ రూమ్ రెండుగా చీలిపోయిందని వార్తలు రావడం ఆ జట్టు ప్రదర్శనను బాగా దెబ్బతీసింది. కానీ ఈ ఏడాది కాలంలో చాలా మార్పులు జరిగాయి. రోహిత్ సారథ్యంలో గతేడాది టీ20 ప్రపంచకప్, ఈ ఏడాది చాంపియన్స్ ట్రోఫీ నెగ్గిన జట్టులో హార్దిక్ ముఖ్య భూమిక పోషించడంతో ముంబై అభిమానులు ‘పాత పగలు’ అన్నీ మరిచిపోయి హార్దిక్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
బ్యాటింగ్‌లో ముంబైకి సమస్యలు లేకపోయినప్పటికీ బుమ్రా తప్ప సిసలైన పేసర్ లేకపోవడం ఆ జట్టును గతంలో ఇబ్బందులకు గురిచేసింది. కానీ ఈసారి వేలంలో ముంబై.. బౌల్ట్, చాహర్‌ను తిరిగి దక్కించుకుంది. వీరికి బుమ్రా కూడా జతకలిస్తే ఇంకేమైనా ఉందా? అయితే బుమ్రా ముంబైతో ఎప్పుడు కలుస్తాడు? ఎన్ని మ్యాచ్‌లు ఆడతాడనే దానిపై స్పష్టత లేకపోవడం ఆ జట్టుకు అతిపెద్ద ఆందోళన. బ్యాటింగ్ పరంగా ముంబై దుర్బేధ్యంగా ఉంది. ఆరంభంలోనే బౌలర్ల లయను దెబ్బతీసే రోహిత్ కు అండగా ఓపెనర్‌గా రికెల్టన్ బరిలోకి దిగే అవకాశముంది. టాపార్డర్‌లో సూర్యఫామ్ కాస్త ఆందోళనకరంగానే ఉన్నా ఒక్క సూపర్ ఇన్నింగ్స్‌తో అతడు మళ్లీ మెరుపులు మెరిపించగలడు. తిలక్ వర్మ నిలకడ, ఫినిషర్‌గా హార్దిక్ మెరుపులు ముంబైకి కీలకం. గాయాలు, ఫిట్నెస్ సమస్యల నుంచి తప్పించుకుంటే ముంబై మరోసారి టైటిల్ నెగ్గడం పెద్ద కష్టమేమీ కాదు.