హైదరాబాద్, జులై 25 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) నిర్వహణపై ఆరోపణలు వచ్చినందున ఈనెల 28వ తేదీ వరకు సెలక్షన్ కమిటీని ఎంపిక చేయవద్దని హైకోర్టు మధ్యంతర ఆదేశాలను జారీ చేసింది. 2024-26 సంవ త్సరాలకు లీగ్ మ్యాచ్‌ల నిర్వహణ పర్యవేక్షణ బాధ్యతలను చూసేందుకు హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావుకు అప్పగించింది. గతంలో జస్టిస్ లావు నాగేశ్వర్రావు పర్యవేక్షణలో జరిగినట్లుగానే ఈసారి జస్టిస్ పి.నవీన్‌రావు ఆధ్వర్యంలో లీగ్ మ్యాచ్‌లు నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేరొంది.
ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేశ్ భీమపాక మధ్యంతర ఆదేశాలను జారీ చేశారు. హెచ్‌సీఏ ఆర్థిక వ్యవహారాల్లో జరిగిన అక్రమాలపై సీబీఐతో దర్యాప్తునకు ఆదేశించాలంటూ సఫిల్‌గూడ క్రికెట్ అసోసియేషన్ వేసిన పిటిషన్‌లోని ఆరోపణలకు వివరణ ఇవ్వాలని ప్రతివాదులకు నోటీసులు జారీ చేశారు. తదుపరి విచారణను ఈనెల 28వ తేదీకి వాయిదా వేశారు. తదుపరి విచారణ వరకు సెలక్షన్ కమిటీలను ఎంపిక చేయరాదన్నారు.