ఢిల్లీ: టీమ్ఇండియా విధ్వంసకర ఓపెనర్ షెఫాలీ వర్మ ఏడు నెలల విరామం తర్వాత తిరిగి జాతీయ జట్టులో చోటు సంపాదించింది. వచ్చే నెలలో ఇంగ్లండ్‌తో జరుగబోయే ఐదు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌ల కోసం బీసీసీఐ గురువారం జట్లను ప్రకటించింది. వన్డేలలో షెఫాలీకి మరోసారి నిరాశే ఎదురైనా టీ20 జట్టులో మాత్రం చోటు దక్కింది. పేలవమైన ఫామ్‌తో నిరుడు అక్టోబర్‌లో ఆమె జట్టుకు దూరమైంది. దేశవాళీ అదరగొట్టిన ఆమె.. మార్చిలో ముగిసిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో 304 పరుగులు చేసి సత్తాచాటింది.
షెఫాలీతో పాటు వికెట్ కీపర్ బ్యాటర్ యస్తికా భాటియా కూడా జట్టులోకి రీఎంట్రీ ఇచ్చింది. టీ20, వన్డే జట్టులోనూ సెలెక్టర్లు ఆమెకు చోటు కల్పించారు. ఈ ఇద్దరూ మినహాయిస్తే ఇటీవల శ్రీలంక, దక్షిణాఫ్రికాతో జరిగిన ముక్కోణపు వన్డే సిరీస్‌లో పాల్గొన్న భారత జట్టులోని ఆటగాళ్లు తమ స్థానాలను నిలుపుకున్నారు. హైదరాబాదీ పేసర్ అరుంధతిరెడ్డికి రెండు ఫార్మాట్లలోనూ చోటు దక్కింది. ముక్కోణపు సిరీస్‌లో అరంగేట్రం చేసిన మరో తెలుగమ్మాయి శ్రీచరణి సైతం వన్డే, టీ20 జట్లకు ఎంపికైంది.