Team India | ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో దుబాయి వేదికగా జరిగిన తొలి సెమీ ఫైనల్స్‌లో ఆస్ట్రేలియాపై నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించిన టీం ఇండియా ఫైనల్స్‌లోకి ఎంటరైంది. సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్ మధ్య జరిగే మరో సెమీ ఫైనల్ మ్యాచ్ విజేతతో టీం ఇండియా ఫైనల్లో తల పడనున్నది. నిర్ణీత 50 ఓవర్లలో 265 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీం ఇండియా మరో 11 బంతులు మిగిలి ఉండగానే విజయ తీరాలకు చేరుకుంది. విజయానికి చేరువలో ఉండగా హార్దిక్ పాండ్యా ఔటయినా 49వ ఓవర్లో మ్యాక్స్‌వెల్ వేసిన తొలి బంతిని కేఎల్ రాహుల్ సిక్సర్‌గా మలచడంతో 267 పరుగులతో టీం ఇండియా విజయం పూర్తయింది.
స్పిన్‌కు అనుకూలంగా ఉన్న పిచ్‌పై టీం ఇండియా బ్యాటర్లు ఆచితూచి ఆడుతూ జట్టు స్కోర్ పెంచడానికి ప్రయత్నించారు. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ చేసి గట్టి పునాది వేసిన విరాట్ కోహ్లీ.. ఈ మ్యాచ్‌లో కూడా 84 పరుగులతో టీం విజయంలో కీలక పాత్ర పోషించారు. 45 పరుగులకే ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ ఔటయినా, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్‌లతో మంచి భాగస్వామ్యాలు నెలకొల్పుతూ జట్టు విజయానికి బాటలు వేశాడు. కోహ్లీ 84 పరుగుల్లో ఐదు ఫోర్లు ఉన్నాయి. కోహ్లీ తర్వాత శ్రేయాస్ అయ్యర్ 45 పరుగులు, కేఎల్ రాహుల్ 42 పరుగులతో పర్వాలేదనిపించారు.
శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, విరాట్ కోహ్లీ తర్వాత నిలకడగా ఆడుతూ హార్దిక్ పాండ్యా 28 పరుగుల వద్ద ఎల్లిస్ బౌలింగ్‌లో మ్యాక్స్‌వెల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారి పట్టాడు. హార్దిక్ పాండ్యా స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన రవీంద్ర జడేజాతో కలిసి కేఎల్ రాహుల్ ఫినిష్ చేశాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో నాథన్ ఎల్లిస్, ఆడం జంపా రెండేసి వికెట్ల చొప్పున, బెన్ డ్వార్షుయిస్, కూపర్ కొనొల్లీ చెరో వికెట్ తీశారు.