ప్రస్తుతం టీమిండియా మేనేజ్మెంట్కు ఒక మంచి తలనొప్పి వచ్చింది. ఆటగాళ్లందరూ సూపర్ ఫామ్ చూపిస్తుండటంతో ఆడే 11 మందిలో ఎవరికి చోటివ్వాలనే విషయంలో జట్టు మేనేజ్మెంట్ తలలు పట్టుకుంటోంది. ఇదే విషయంపై టీమిండియా కొత్త కెప్టెన్ రోహిత్ శర్మ కూడా స్పందించాడు. వెస్టిండీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో సూర్యకుమార్ యాదవ్ అద్భుతంగా రాణించాడు.
ఆ తర్వాత శ్రీలంకతో జరిగిన సిరీస్‌లో శ్రేయాస్ అయ్యర్ సత్తా చాటాడు. ఈ సిరీస్‌లో రిషభ్ పంత్, విరాట్ కోహ్లీకి విశ్రాంతినిచ్చారు. గాయం కారణంగా సూర్యకుమార్ యాదవ్ సిరీస్‌కు దూరమయ్యాడు. ఇప్పుడు శ్రీలంక టెస్టు సిరీస్‌కు వీళ్లంతా తిరిగొస్తున్నారు. భవిష్యత్తులో సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్లలో ఎవరికి జట్టులో చోటు ఇవ్వాలనేది పెద్ద తలనొప్పేనని రోహిత్ ఒప్పుకున్నాడు. అయితే ఇది మంచి తలనొప్పి అని చెప్పాడు.
‘‘ఆటగాళ్లు ఫామ్‌లో లేకపోవడం కన్నా అందరూ ఫామ్‌లో ఉండటం మంచిదే. వాళ్లిద్దరిలో ఒకరిని ఎంచుకోవడం కష్టమే. కానీ ఎవరూ జట్టులో చోటు విషయంలో భయపడాల్సిన అవసరం లేదు. అందరూ ఫామ్‌లో ఉంటేనే జట్టు మరింత పటిష్టంగా తయారవుతుంది’’ అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. వెస్టిండీస్, శ్రీలంకతో జరిగిన సిరీసులను వైట్వాష్లుగా ముగించిన రోహిత్ శర్మ.. మార్చి 4న మొహాలీ వేదికగా జరిగే టెస్టులో తొలిసారి టెస్టు కెప్టెన్‌గా బరిలో దిగనున్నాడు.