Asia Cup | వన్డే ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా జరుగుతున్న ఆసియాకప్‌లో టీమ్ఇండియా ఫైనల్ ఫైట్‌కు సిద్ధమైంది. గత ఐదేండ్లలో ఒక్క పెద్ద టోర్నీలోనూ విజేతగా నిలువలేకపోయిన భారత్.. నేడు తుదిపోరులో శ్రీలంకతో అమీతుమీ తేల్చుకోనుంది. స్టార్లతో నిండి ఉన్న రోహిత్ సేన ఫేవరెట్‌గా బరిలోకి దిగనుండగా.. మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది.
కొలంబో: ఆసియా సింహాలెవరో తేలిపోయే సమయం ఆసన్నమైంది. టోర్నీలో చక్కటి ప్రదర్శనతో ఫైనల్‌కు చేరిన భారత జట్టు.. ఆదివారం ప్రేమదాస స్టేడియంలో జరుగనున్న తుది సమరంలో ఆతిథ్య శ్రీలంకను ఢీకొట్టనుంది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో సమర్థవంతమైన ఆటగాళ్లతో టీమ్ఇండియా బలంగా ఉంటే.. లంకను గాయాల బెడద వేధిస్తున్నది. చివరిసారిగా భారత జట్టు 2018 ఆసియాకప్ ఫైనల్లో బంగ్లాదేశ్‌పై గెలిచి ట్రోఫీచేజిక్కించుకోగా.. ఆ తర్వాత ఐదేండ్ల నుంచి ఒక్కసారి కూడా రెండు కంటే ఎక్కువ దేశాలు పాల్గొన్న టోర్నీలో టీమ్ఇండియా విజేతగా నిలువలేదు.
మరి ఇన్నాళ్ల ఎదురుచూపులు ఆదివారంతో తెరపడతాయా చూడాలి. పనిభారం కారణంగా బంగ్లాదేశ్‌తో నామమాత్ర పోరుకు విశ్రాంతినిచ్చిన విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, బుమ్రా, సిరాజ్ తిరిగి రానున్నారు. దీంతో టీమ్ఇండియా బలం మరింత పెరగనుండగా.. అక్షర్ పటేల్ గాయం నేపథ్యంలో హుటాహుటిన జట్టులోకి ఎంపిక చేసిన సుంద ర్కు అవకాశం ఇస్తారా లేక తెలంగాణ కుర్రాడు తిలక్ వర్మను కొనసాగిస్తారా అనేది ఆసక్తికరం. పిచ్ స్పిన్‌కు సహకరించనున్న నేపథ్యంలో మేనేజ్మెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
ఇక బంగ్లాతో పోరు లో సెంచరీతో చెలరేగిన గిల్ అదే ప్రదర్శన పునరావృతం చేయాలని అభిమాను లు ఆశిస్తుండగా.. రోహిత్, కోహ్లీ, రాహుల్, పాండ్యా, ఇషాన్ కూడా తలో చేయి వేస్తే.. భారత్ భారీ స్కోరు చేయడం ఖాయమే. బుమ్రా బౌలింగ్ భారాన్ని మోయనుండగా.. కుల్దీప్ స్పిన్ బాధ్యతలు చూసుకోనున్నాడు. మరోవైపు లంకను గాయాలు ఇబ్బంది పెడుతున్నాయి. తీక్షణ అందుబాటులో లేకపోగా.. యువ సంచలనం దునిత్ వెల్లలాగె నుంచి మరోసారి భారత టాపార్డర్‌కు ముప్పు పొంచి ఉంది.
తుది జట్లు (అంచనా)
భారత్: రోహిత్ (కెప్టెన్), గిల్, కోహ్లీ, రాహుల్, ఇషాన్, పాండ్యా, జడేజా, శార్దూల్/సుందర్, కుల్దీప్, సిరాజ్, బుమ్రా.
శ్రీలంక: షనక (కెప్టెన్), కుషాల్ పెరెరా, నిషాంక, కుషాల్ మెండిస్, సమరవిక్రమ, చరిత అసలంక, ధనంజయ, దునిత్, దుషన్, పతిరణ, కసున్ రజిత.
పిచ్, వాతావరణం
కొలంబోలో గత తొమ్మిది రోజుల్లో ఇది ఆరో మ్యాచ్ కాగా.. ఈ సారి కూడా పిచ్ స్లోగానే ఉండే అవకాశాలున్నాయి. స్పిన్నర్లకు నుంచి సహకారం లభించనుంది. మ్యాచ్‌కు వర్ష సూచన ఉంది. వన్డే ప్రపంచకప్ ప్రారంభానికి ముందు ఆసియాకప్ ఫైనల్ నెగ్గడం చాలా ముఖ్యం. దీంతో ఆటగాళ్ల ఆత్మైస్థెర్యం పెరగడంతో పాటు.. విజయ పరంపర అలవాటు అవుతుంది. పరిస్థితులకు తగ్గ ట్లు ఆడటం ముఖ్యం.
-శుభ్‌మన్ గిల్