Team India | ఆస్ట్రేలియా వేదికగా జరిగిన బోర్డర్-గవాస్కర్ టెస్ట్ సిరీస్‌లో టీమిండియా ఓటమి పాలైంది. సిరీస్‌లో భారత బ్యాటింగ్ లైనప్‌పై ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆస్ట్రేలియా పర్యటనలో విఫలమైన స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతో పాటు ఇతర క్రికెటర్లను సైతం దేశీయ సీజన్లో తమను తామను నిరూపించుకోవాలని సూచించే అవకాశాలున్నాయి. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లో ఇబ్బందికరంగా తయారైంది. రోహిత్, విరాట్ పేలవ ప్రదర్శన నేపథ్యంలో టెస్టుల్లో ఇద్దరి భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. జట్టు ప్రదర్శన నేపథ్యంలో బీసీసీఐ వేగంగా స్పందించి దిద్దుబాటు చర్యలు చేపట్టాలని మాజీలు సూచిస్తున్నారు.
ప్రస్తుతం రంజీ ట్రోఫీ రెండో రౌండ్ మొదలుకానున్నది. విజయ్ హజారే ట్రోఫీ వన్డే టోర్నమెంట్ సైతం జరుగనున్నది. దేశీయ సీజన్ ఫిబ్రవరి వరకు కొనసాగనుండగా.. క్రికెటర్లు అందరూ దేశవాళీ టోర్నీలో ఆడాలని కోచ్ గౌతమ్ గంభీర్, దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ ఇప్పటికే సూచించారు. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌ను పిలిచి దేశవాళీ టోర్నీల్లో ఆడేలా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి సీనియర్ క్రికెటర్లతో మాట్లాడించే అవకాశం ఉందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. విరాట్ కోహ్లి చివరిసారిగా 2012లో ఢిల్లీ తరఫున యూపీపై ఘజియాబాద్‌లో రంజీ ట్రోఫీలో ఆడాడు. ఇక రోహిత్ శర్మ చివరిసారిగా 2015లో రంజీ ట్రోఫీలో పాల్గొన్నాడు. రోహిత్, విరాట్ రిటైర్మెంట్ ప్రకటించినా.. ఇద్దరి స్థానంలో ఆరుగురు క్రికెటర్లు పోటీపడుతున్నారు. ఇందులో తమిళనాడు ఎడమచేతి వాటం ఆటగాడు బీ సాయి సుదర్శన్ గట్టి పోటీ ఇస్తున్నాడు. భారత్-ఏ తరఫున ఆస్ట్రేలియా ఏతో జరిగిన టెస్టులో సెంచరీ సాధించాడు. హెర్నియా ఆపరేషన్ కారణంగా రీహాబిలిటేషన్‌కు వెళ్లాడు. ఫిట్నెస్ సాధిస్తే జూన్‌లో ఇంగ్లండ్‌తో జరిగే జట్టులో చోటు దక్కే అవకాశాలున్నాయి.
కర్నాటక ఆటగాడు దేవ్‌దత్ పడిక్కల్‌తో పాటు రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్, రజత్ పాటిదార్ పోటీలో ఉన్నారు. స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లో రజత్ పాటిదార్‌కు అవకాశాలు వచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. స్వదేశంలో ప్రతికూల పరిస్థితుల్లో అద్భుత ప్రదర్శన చేయగలిగిన బ్యాట్స్‌మెన్స్ కోసం సెలక్టర్లు కన్నేశారు. ఆస్ట్రేలియన్ టూర్లో అభిమన్యు ఈశ్వరన్ జట్టులో అవకాశం లభించినా.. బ్యాటింగ్ టీమ్ మేనేజ్మెంట్కు నచ్చలేదు. సర్ఫరాజ్‌కు ప్లేయింగ్ చోటు దక్కలేదు. ఆస్ట్రేలియాలో జస్ప్రీత్ బుమ్రా తప్ప మరే బౌలర్ రాణించలేదు. సిరాజ్ 20 వికెట్లు తీసినా.. పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ప్రసిద్ధ్ కృష్ణ సిడ్నీ టెస్టులో ఆరు వికెట్లు తీసినా బౌలింగ్‌లో నిలకడ లోపించింది. ఆకాశ్ దీప్ సైతం ఆకట్టుకోలేకపోయాడు. ఆస్ట్రేలియా సిరీస్‌లో గాయం కారణంగా సిడ్నీ టెస్టుకు దూరమయ్యాడు.