T20 World Cup 2026 : మహిళల వన్డే వరల్డ్ కప్ పోటీలకు ఆతిథ్యమిచ్చిన భారత్, శ్రీలంక మరో మెగా టోర్నీ నిర్వహణకు సిద్ధమవుతున్నాయి. వచ్చే ఏడాది పురుషుల టీ20 ప్రపంప కప్(T20 World Cup 2026) టోర్నీకి హోస్ట్‌లుగా ఎంపికైన ఇరుదేశాల్లోని వేదికలు వచ్చేశాయి. మెగా టోర్నీకి సమయం సమీపిస్తున్న వేళ గురువారం అంతర్జాతీయ క్రికెట్ మండలి వరల్డ్ కప్ మ్యాచ్‌ల కోసం స్టేడియాలను ఖరారు చేసింది. ఫిబ్రవరి 7న విశ్వ క్రీడా సమరం ప్రారంభం కానున్న నేపథ్యంలో భారత్‌లో ఐదు, లంకలోని రెండు నగరాలను ఎంపిక చేసింది ఐసీసీ.
పొట్టి ప్రపంచ కప్ బెర్తులు ఖరారు కావడంతో త్వరలోనే ప్రపంచ కప్ పూర్తి షెడ్యూల్‌ను ఐసీసీ విడుదల చేయనుంది. టోర్నీకి అర్హత సాధించిన 20 జట్లలో వేటిని ఏ గ్రూప్‌లో ఉంచాలి? ఏ మ్యాచ్‌లు ఎక్కడ ఆడించాలి? అనే విషయంపై కసరత్తు చేస్తున్న ఐసీసీ గురువారం వేదికలను ప్రకటించింది. శ్రీలంకతో కలిసి సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నప్పటికీ ప్రేక్షకాదరణ దృష్ట్యాలో భారత్‌కే పెద్దపీట వేసింది ఐసీసీ.
The 2026 T20 World Cup will include 20 teams and will be played at three venues in Sri Lanka and five in India
More details: https://t.co/3WV7Wp6Bx7 pic.twitter.com/RgiFSQt9uL
— ESPNcricinfo (@ESPNcricinfo) November 6, 2025
ప్రధాన నగరాలైన అహ్మదాబాద్, కోల్‌కతా, ఢిల్లీ, చెన్నై, ముంబైలో వరల్డ్ కప్ మ్యాచ్‌లకు ఎంపిక చేసింది. శ్రీలంక విషయానికొస్తే.. కొలంబో, క్యాండీ టోర్నీకి వేదిక కానున్నాయి. ఫిబ్రవరి 7న జరుగబోయే ఆరంభ పోరుకు వేదికైన అహ్మదాబాద్‌లోనే మార్చి 8న ఫైనల్ జరుగనుంది. అయితే.. బీసీసీఐ, పాక్ బోర్డు అంగీకరించినందున పాకిస్థాన్ జట్టు మ్యాచ్‌లన్నీ శ్రీలంకలో ఆడించనున్నారు. ఒకవేళ పాక్ టీమ్ ఫైనల్ చేరితే అహ్మదాబాద్‌లో కాకుండా మ్యాచ్ నిర్వహించడం ఖాయం.
Here are the 5️⃣ Indian venues that have been shortlisted to host the T20 World Cup 2026! 🏟#T20WorldCup #T20WC2026 #CricketTwitter pic.twitter.com/WwJU5EcTiD
— InsideSport (@InsideSportIND) November 6, 2025
ఈ టోర్నీకి భారత్, శ్రీలంక ఆతిథ్య జట్లుగా క్వాలిఫై అయ్యాయి. నిరుడు జరిగిన ప్రపంచ కప్‌లో టాప్-7లో నిలిచిన అఫ్గనిస్థాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, యూఎస్ఏ, వెస్టిండీస్‌లకు నేరుగా బెర్తు దక్కింది. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ ఆధారంగా ఐర్లాండ్, న్యూజిలాండ్, పాకిస్థాన్ అర్హత సాధించాయి. ఆఫ్రికా క్వాలిఫయర్స్ ద్వారా నమీబియా, జింబాబ్వే వరల్డ్ కప్ బరిలోకి వచ్చాయి. యూరప్ క్వాలిఫయర్స్‌లో అదరగొట్టిన ఇటలీ, నెదర్లాండ్స్.. అమెరికన్ క్వాలిఫయర్స్ నుంచి కెనడాలు క్వాలిఫై అయ్యాయి. ఇక చివరి క్వాలిఫయర్ టోర్నీ అయిన తూర్పు ఆసియా ఫసిఫిక్ నుంచి ఒమన్ నేపాల్ యూఏఈలు ప్రపంచ కప్‌లో పోటీపడే అవకాశాన్ని పట్టేశాయి.
వరల్డ్ కప్ బరిలోని జట్లు : భారత్, శ్రీలంక (ఆతిథ్య దేశాలు), ఆస్ట్రేలియా, అఫ్గనిస్థాన్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, యూఎస్ఏ, వెస్టిండీస్, ఐర్లాండ్, న్యూజిలాండ్, పాకిస్థాన్, కెనడా, ఇటలీ, నెదర్లాండ్స్, నమీబియా, జింబాబ్వే, నేపాల్, ఒమన్, యూఏఈ.