సిడ్నీ: భారత తాత్కాలిక కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా గాయపడ్డాడు. ఆస్ట్రేలియాతో ఐదో టెస్టు రెండో రోజు ఆటలో బుమ్రా వెన్నునొప్పికి గురవ్వడం ఒకింత ఆందోళనకు గురి చేసింది. భోజన విరామం తర్వాత ఒక ఓవర్ వేసిన బుమ్రా వెంటనే మైదానాన్ని వీడాడు. బుమ్రా స్థానంలో సర్ఫరాజ్‌ఖాన్ ఫీల్డింగ్‌కు రాగా విరాట్ కోహ్లీ స్టాండింగ్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. జట్టు వైద్య సిబ్బందితో కలిసి బుమ్రా స్కానింగ్ పరీక్షలకు వెళ్లాడు. అయితే మ్యాచ్ జరుగుతున్నప్పుడే తిరిగి స్టేడియానికి చేరుకున్న స్టార్ స్పీడ్‌స్టర్ గాయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
‘ముందస్తు జాగ్రత్తగా బుమ్రా స్కానింగ్ పరీక్షలు నిర్వహిం చాం. అతను బ్యాటింగ్ చేసేందుకు పెద్దగా ఇబ్బందేమి లేదు. కానీ బౌలింగ్ చేయాలా వద్దా అనేది ఆదివారం తేలుతుంది’ అని జ ట్టు వర్గాలు పేర్కొన్నాయి. బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో ప్రస్తుతం బుమ్రా టాప్ వికెట్ టేకర్‌గా కొనసాగుతున్నాడు. ఆసీస్ బ్యాటర్లకు కొరకరాని కొయ్యగా వికెట్ల వేట సాగిస్తున్నా డు. ఒక వేళ గాయం తీవ్రతతో బౌలింగ్‌కు రాకపోతే..భారత గెలుపు అవకాశాలపై కచ్చితంగా ప్రభావం చూపిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.