Devisha Shetty : పొట్టి ఫార్మాట్ సంచలనం సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav) 34వ వసంతంలోకి అడుగు పెట్టాడు. ఈ సందర్బంగా అతడి భార్య దేవిశ శెట్టి (Devisha Shetty) సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. మిస్టర్ 360 ఆటగాడిగా ప్రశంసలు అందుకుంటున్న సూర్యకు ఆమె తమ అనుబంధాన్ని ప్రతిబింబించేలా ఇన్స్టాగ్రామ్ వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది.
‘నా బెస్ట్ ఫ్రెండ్, భర్త, ప్రేమికుడు, నా ప్రపంచం, నా జీవితంలో గొప్ప నిర్ణయం అయిన నీకు హ్యాపీ బర్త్ డే. ప్రతి రోజుకు నా కృతజ్ఞతలు. నువ్వు ఈ ప్రపంచాన్ని అత్యద్భుతంగా మార్చేస్తావ్. నువ్వు లేకుంటే నాకు ఏం చేయాలో తెలియదు అని దేవిశ తన పోస్ట్‌లో రాసుకొచ్చింది. అంతేకాదు పొట్టి క్రికెట్లో నువ్వు టీమిండియాను మరికొన్నాళ్లు నడిపిస్తూ.. జట్టుకు మరిన్ని విజయాలు అందిస్తుంటే చూడాలని ఎంతో ఉత్సాహంగా ఉన్నా’ అని ఆమె భర్త విజయాన్ని ఆకాంక్షించింది.
ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున వీరకొట్టుడు కొట్టిన సూర్యకుమార్ యాదవ్ లేటు వయసులో బ్లూ జెర్సీ వేసుకున్నాడు. తనమార్క్ విధ్వంసక ఇన్నింగ్స్‌లతో టీ20ల్లో నంబర్ 1 ర్యాంకర్‌గా ఎదిగాడు. పొట్టి ప్రపంచ కప్ విజయం తర్వాత సూర్య భారత జట్టు పగ్గాలు అందుకున్నాడు.
హార్దిక్ పాండ్యా (Hardhik Pandya) స్థానంలో టీ20 సారథిగా ఎంపికైన సూర్య తొలి సిరీస్‌లోనే సత్తా చాటాడు. లంకపై 2-1తో టీమిండియా ట్రోఫీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. టీ20ల్లో వీరావేశంతో బౌలర్లపై విరుచుకుపడే సూర్య వన్డేల్లో తేలిపోయాడు. ప్రస్తుతం అతడు టెస్టు క్రికెట్‌పై దృష్టి పెట్టిన విషయం తెలిసిందే.