Suresh Raina : భారత మాజీ ఆల్‌రౌండర్ సురేశ్ రైనా (Suresh Raina) మళ్లీ బ్యాటుతో బాదేందుకు సిద్ధమవుతున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు తర్వాత ఫ్రాంచైజ్ క్రికెట్లో మెరుస్తున్న రైనా.. ఇక యూఎస్ టీ10 లీగ్(US Masters T10 League)లో తన మార్క్ ఆటతో చెలరేగనున్నాడు. కొత్త ఫ్రాంచైజీ చికాగో ప్లేయర్స్(Chicago Players) తరఫున పరుగుల వరద పారించేందుకు ఈ లెఫ్ట్ హ్యాండర్ ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాడు.
ఈ విషయాన్ని రైనా సోషల్ మీడియా వేదికగా మంగళవారం అందరితో పంచుకున్నాడు. ‘యూఎస్ మాస్టర్స్ టీ10 లీగ్‌లో భాగం అవుతున్నందుకు చాలా థ్రిల్‌గా ఉంది. ఈమధ్య కాలంలో బాగా పాపులర్ అవుతున్న టీ10 లీగ్‌లో ఆడడాన్ని ఎంజాయ్ చేయబోతున్నా. అమెరికాలోని క్రికెట్ అభిమానుల ముందు ఆడేందుకు ఎంతో ఆతృతగా ఉన్నాను’ అని రైనా ఎక్స్ పోస్ట్‌లో తెలిపాడు.
Suresh Raina will play for The Chicago Players in US Masters T10 🥳#USMastersT10 #SureshRaina #Raina @ImRaina pic.twitter.com/BM7V8lN28j
— Dhoni Raina Team (@DhoniRainaTeam) September 10, 2024
యూఎస్ మాస్టర్స్ టీ10 లీగ్ ఈ ఏడాది నవంబర్ 8వ తేదీ నుంచి 17వ తేదీ వరకూ జరుగనుంది. ఈ లీగ్‌లో రైనాతో పాటు భారత మాజీ క్రికెటర్ పార్థీవ్ పటేల్(Parthiv Patel), పవన్ నేగీలు కూడా చికాగో ప్లేయర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నారు. ఫినిషర్‌గా పేరొందిన రైనా 2011 వరల్డ్ కప్ గెలుపొందిన టీమిండియాలో సభ్యుడు
ఒకప్పుడు సహచరుడు యువరాజ్ సింగ్(Yuvraj Singh)తో కలిసి టీమిండియాకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన రైనా.. అనంతరం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో చెన్నై సూపర్ కింగ్స్ ప్రధాన ఆటగాడిగా చితక్కొట్టాడు. కొన్నాళ్లుగా ఆటకు దూరమైన ఈ లెఫ్ట్ హ్యాండర్ ఇండియన్ వెటరన్ ప్రీమియర్ లీగ్ (Indian Veteran Premier League) ఆరంభ సీజన్లోనూ బ్యాటుతో, బంతితో రఫ్పాడించాడు.
చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ధోనీ తర్వాతి స్థానం రైనాదే అన్నట్టుగా ఉండేది. అందరూ అతడిని చిన్న తాలా అని ముద్దుగా పిలిచేవాళ్లు. తన విధ్వంసక ఆటతో అభిమానులను అలరించిన రైనా సీఎస్కే తరఫున నాలుగు ట్రోఫీలు గెలిచాడు. ఊచకోతకు కేరాఫ్ అనిపించే ఈ లెఫ్ట్ హ్యాండర్ చెన్నైకి 205 మ్యాచుల్లో ప్రాతినిధ్యం వహించాడు. 136.6 సగటుతో రైనా 5,528 పరుగులు సాధించాడు. 2022లో ఐపీఎల్, దేశవాళీ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన రైనా ప్రస్తుతం యువ ఆటగాళ్లకు కోచింగ్ ఇస్తున్నాడు.