Pramod Tiwari : కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలో కాషాయ పార్టీ, ఆరెస్సెస్‌పై చేసిన వ్యాఖ్యలు హాట్ డిబేట్‌గా మారాయి. రాహుల్ గాంధీ వ్యాఖ్యలను బీజేపీ నేతలు తీవ్రంగా తప్పుపడుతున్నారు. విదేశీ గడ్డపై దేశాన్ని అవమానించేలా మాట్లాడటం రాహుల్‌కు అలవాటుగా మారిందని దుయ్యబట్టారు. చైనాను కీర్తిస్తూ దేశాన్ని తక్కువ చేసి మాట్లాడటం రాహుల్‌కు తగదని కాషాయ నేతలు మండిపడుతున్నారు.
మరోవైపు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల్లో తప్పులేదని కాంగ్రెస్ నేతలు సమర్ధిస్తున్నారు. రాహుల్ ప్రకటనపై యూపీ కాంగ్రెస్ నేత ప్రమోద్ తివారీ స్పందించారు. కులం, మతం ఆధారంగా దేశంలో ప్రజల మధ్య విభజన చిచ్చు రగల్చాలని బీజేపీ, ఆరెస్సెస్ భావిస్తున్నాయని ఆయన ఆరోపించారు. దేశంలో మతోన్మాదం చొప్పించి ప్రజలను విభజించాలని కాషాయ శ్రేణులు కుయుక్తులు పన్నుతున్నాయని అన్నారు.
రాహుల్ గాంధీ ఈ విషయాలనే ప్రజల ముందుంచారని, ఆయన వ్యాఖ్యల్లో నూరుశాతం వాస్తవముందని స్పష్టం చేశారు. కాగా, రాహుల్ గాంధీ టెక్సాస్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆరెస్సెస్‌పై తీవ్రస్ధాయిలో విరుచుకుపడ్డారు. యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్‌లో భారత సంతతికి చెందిన వారిని ఉద్దేశించి రాహుల్ మాట్లాడుతూ భారత్ ఒకే ఆలోచనకు సంబంధించిందని ఆరెస్సెస్ భావిస్తుందని, కానీ తాము భారత్ విభిన్న ఆలోచనలకు వేదికగా భావిస్తామని చెప్పుకొచ్చారు. కొన్ని మతాలు, భాషలను ఆరెస్సెస్ తక్కువగా పరిగణిస్తుందని వ్యాఖ్యానించారు.
Read More :