Train | దేశంలో రైలు (Train) ప్రమాదాలకు దారి తీసేలా కుట్రపూరిత ప్రయత్నాలు ఆందోళన కలిగిస్తున్నాయి. రెండు రోజుల క్రితం ఉత్తరప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో రైలు ప్రమాదాలకు దుండగులు పన్నిన భారీ కుట్ర వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఇలాంటి ఘటనే మహారాష్ట్ర (Maharashtra)లో మరొకటి చోటు చేసుకుంది. సోలాపూర్ (Solapur) మార్గంలోని రైలు పట్టాలపై దుండగులు పెద్ద సిమెంట్ దిమ్మెను ఉంచారు. ఇది గమనించిన లోకో పైలట్ సకాలంలో స్పందించి దాన్ని రైలు ఢీ కొట్టకుండా తప్పించాడు. లోకో పైలట్ సమయస్పూర్తితో పెను ప్రమాదం తప్పినట్లైంది. ఈ ఘటనపై అధికారులు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు.
కాగా, ఆదివారం యూపీలో భివాండి-ప్రయాగ్‌రాజ్ కాళిందీ ఎక్స్‌ప్రెస్‌కు కాన్పూర్‌లో పెను ప్రమాదం తప్పిన విషయం తెలిసిందే. ట్రాక్‌పై ఉంచిన గ్యాస్ సిలిండర్‌ను రైలు ఢీకొంది. అయితే రైలుకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. రైలును పట్టాలు తప్పించడానికి జరిగిన విద్రోహ చర్యగా దీనిని భావిస్తున్నామని, ఘటనా స్థలిలో ఒక పెట్రోల్ బాటిల్, అగ్గిపెట్టెను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఆదివారం రాత్రి 8.20 గంటలకు రైలు అతివేగంతో వెళ్తుండగా, పట్టాలపై ఎల్పీజీ సిలిండర్ ఉండటాన్ని గమనించిన లోకో పైలెట్ ఎమర్జెన్సీ బ్రేకులు ప్రయోగించారు. అయినప్పటికీ రైలు సిలిండర్‌ను ఢీకొనడంతో అది పట్టాలకు దూరంగా ఎగిరిపడింది. ఘటనపై కేసు నమోదైందని, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీస్ అధికారి చెప్పారు.
ఇక అదే రోజు రాజస్థాన్ (Rajasthan)లోని అజ్మీర్ (Ajmer)లో రైలు ప్రమాదానికి దుండగులు భారీ కుట్ర పన్నినట్లు తెలిసింది. పూలేరా – అహ్మదాబాద్ రూట్లో రైలు ట్రాక్‌పై దుండగులు సుమారు 70 కేజీల బరువైన సిమెంట్ దిమ్మెను (cement block) ఉంచారు. దీంతో రైలు సిమెంట్ దిమ్మెను ఢీ కొట్టుకుంటూ ముందుకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో రైలు ఇంజిన్‌తోపాటు కొంత భాగం దెబ్బతిన్నది. ఈ ఘటనపై లోకో పైలట్ ఆర్పీఎఫ్ అధికారులకు సమాచారం ఇచ్చారు. ప్రమాద ప్రాంతంలో విరిగిన సిమెంట్ దిమ్మె భాగాలను గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
వరుస రైలు ప్రమాదాలపై భారతీయ రైల్వే స్పందించింది. గత నెల ఆగస్టు నుంచి ఈ నెల 8వ తేదీ వరకూ 18 ఘటనలు చోటు చేసుకున్నట్లు తెలిపింది. ఇందులో ఆదివారం ఒక్కరోజే రెండు ఘటనలు చోటు చేసుకున్నట్లు పేర్కొంది. రైళ్లను పట్టాలు తప్పించేందుకే ఈ కుట్రలు జరిగాయని పేర్కొంది. ఈ 18 ఘటనల్లో 15 ప్రమాదాలు ఆగస్టులో జరగ్గా.. మరో మూడు ఈ నెల (సెప్టెంబర్‌లో) జరిగినట్లు వివరించింది. రైలు ట్రాక్‌లపై వివిధ రకాల వస్తువులను అధికారులు గుర్తించినట్లు తెలిపింది. వీటిలో ఎల్పీజీ సిలిండర్లు, సైకిళ్లు, ట్రాక్టర్లు, ఇనుప రాడ్లు, సిమెంట్ దిమ్మెలు ఉన్నాయి. ఇలాంటి ఘటనలు ఎక్కువగా ఉత్తరప్రదేశ్‌లోనే వెలుగు చూసినట్లు తెలిపింది. ఆ తర్వాత పంజాబ్, జార్ఖండ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ ప్రమాదాలు జరిగినట్లు వివరించింది. ఇక జూన్ 2023 నుంచి ఇప్పటి వరకూ ఈ తరహా ఘటనలు 24 జరిగినట్లు తెలిపింది.
Also Read..
Haryana CM | అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా హర్యానా సీఎం నాయబ్‌సింగ్.. Video
Haryana Polls: వినేశ్ ఫోగట్ వర్సెస్ కెప్టెన్ యోగేశ్ బైరాగి.. రెండో లిస్టు రిలీజ్ చేసిన బీజేపీ
bridge collapse | వియత్నాంలో టైఫూన్ యాగి బీభత్సం.. నదిలో కూలిన బ్రిడ్జ్.. షాకింగ్ వీడియో