PM Modi : ‘ఒలింపిక్స్-2036 (Olympics-2036)’ క్రీడల నిర్వహణకు భారత్ పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతోందని ప్రధాన మంత్రి (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) అన్నారు. గత పదేళ్లలో అంతర్జాతీయ క్రీడలకు భారత్ వేదికగా నిలిచిందని చెప్పారు. వారణాసిలో 72వ జాతీయ వాలీబాల్ ఛాంపియన్షిప్ పోటీలను ప్రధాని ప్రారంభించారు. ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన మాట్లాడారు.
గత దశాబ్ద కాలంలో భారత్లో 20కిపైగా అంతర్జాతీయ క్రీడా పోటీలు నిర్వహించామని ప్రధాని గుర్తుచేశారు. అండర్-17 ఫిపా వరల్డ్కప్, హాకీ వరల్డ్ కప్, చెస్ టోర్నమెంట్ లాంటి అంతర్జాతీయ ఈవెంట్లకు భారత్ ఆతిథ్యం ఇచ్చిందన్నారు. 2030లో జరిగే కామన్వెల్త్ గేమ్స్ కూడా భారత్లోనే జరగనున్నాయని తెలిపారు. 2036లో ఒలింపిక్ క్రీడల కోసం భారత్ పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతోందని చెప్పారు.
భారత్ అభివృద్ధి వృత్తాంతాన్ని ప్రధాని మోదీ వాలీబాల్ క్రీడతో పోల్చారు. ఏ విజయమైనా ఒక్కరితో సాధ్యం కాదనే విషయాన్ని ఈ వాలీబాల్ క్రీడ తెలియజేస్తుందని, మన సమన్వయం, విశ్వాసం, జట్ల సంసిద్ధతపైనే మన విజయం ఆధారపడి ఉంటుందని అన్నారు. ఇందులో ప్రతి ఒక్కరి పాత్ర, బాధ్యత ఉంటుందని, వాటిని నెరవేర్చినప్పుడే మనం విజయం సాధిస్తామని చెప్పారు.
కాగా జనవరి 4 నుంచి 11 వరకు జరగనున్న ఈ జాతీయ వాలీబాల్ ఛాంపియన్షిప్లో దేశవ్యాప్తంగా 58 జట్లకు చెందిన వెయ్యి మందికిపైగా క్రీడాకారులు పాల్గొంటున్నారు. ఈ పోటీలతో వారణాసి నగరం జాతీయ స్థాయి క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలకు వేదికగా మారుతుందని వాలీబాల్ ఛాంపియన్షిప్ నిర్వాహకులు చెబుతున్నారు.