Apple Tea | ఆపిల్ పండ్లు మన ఆరోగ్యానికి అనేక రకాలుగా మేలు చేస్తాయన్న సంగతి మనకు తెలిసిందే. ఆపిల్స్ ను తీసుకోవడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. బరువు అదుపులో ఉంటుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఆపిల్ ను నేరుగా తినడంతో పాటు సలాడ్, కస్టర్డ్, పుడ్డింగ్, కేక్ ల వంటి వాటిని కూడా తయారు చేసుకుని తింటూ ఉంటాం. వీటితో పాటు ఆపిల్స్ తో మనం ఆపిల్ టీని కూడా తయారు చేసుకోవచ్చు. ఆపిల్ టీ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఆపిల్ టీ ని తయారు చేసుకోవడం కూడా చాలా సులభం.
ఆపిల్ ముక్కలను, బ్లాక్ టీ ఆకులతో చేసే ఈ టీ ని తీసుకోవడం వల్ల మొత్తం శరీరానికి మేలు కలుగుతుంది. మన ఆరోగ్యానికి మేలు చేసే ఆపిల్ టీని ఎలా తయారు చేసుకోవాలి.. అలాగే ఆపిల్ టీ ని తీసుకోవడం వల్ల మన శరీరానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి పోషకాహార నిపుణులు వివరిస్తున్నారు. ఆపిల్ టీ లో ఎక్కువ మొత్తంలో విటమిన్ సి ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్పెక్షన్ లు త్వరగా మన దరి చేరకుండా ఉంటాయి. అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడే వారు ఆపిల్ టీని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. దీనిలో ఉండే ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను కరిగించడంలో సహాయపడతాయి.
ఆపిల్ టీని తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఆపిల్స్ లో ఉండే మాలిక్ ఆమ్లం ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థను నిర్వహించడంలో సహాయపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో కూడా ఆపిల్ టీ మనకు సహాయపడుతుంది. ఆపిల్ టీని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. అంతేకాకుండా ఈ టీని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిల్లో వచ్చే ఆకస్మిక పెరుగుదల లేదా తగ్గుదల వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. ఆపిల్ టీ లో క్యాలరీలు కూడా తక్కువగా ఉంటాయి. కనుక బరువు తగ్గాలనుకునే వారు టీ, కాఫీలకు బదులుగా దీనిని తీసుకోవడం వల్ల శరీర బరువు అదుపులో ఉండడంతో పాటు ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది.
ఇక ఆపిల్ టీ ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఒక గిన్నెలో మూడు కప్పుల నీరు పోసి అందులో ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, ఒక టీ బ్యాగ్ వేసి మరిగించాలి. ఈ నీరు మరిగిన తరువాత అందులో ఆపిల్ ను తొక్కతో సహా చిన్న ముక్కలుగా చేసి వేయాలి. దీనిని మరో 5 నిమిషాల పాటు మరిగించి ఆ తరువాత అందులో దాల్చిన చెక్క పొడి వేసి కలిపి వడకకట్టి తీసుకోవాలి. ఇలా తయారు చేసిన ఆపిల్ టీని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది.