Smartphones: త్వరలో దాదాపు 20 శాతం వరకు స్మార్ట్ ఫోన్ల ధరలు పెరగనున్నాయి. అయితే, ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఫోన్ల ధరలు పెరిగే అవకాశం ఉందని స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు చెబుతున్నాయి. దీనికి కారణం.. ఫోన్లలో వాడే మెమరీ చిప్స్ కు డిమాండ్ పెరగడమే. ఇటీవల ఏఐ సంస్థలు మార్కెట్లో దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. ఏఐ టెక్నాలజీ వాడాలంటే మెమరీ చిప్స్ అవసరం. దీంతో మెమరీ చిప్స్ కోసం ఆయా సంస్థలు 2027 వరకు భారీగా బుకింగ్స్ చేస్తున్నాయి.
ఏఐ సంస్థలకు కూడా చిప్స్ సరఫరా చేస్తుండటంతో, డిమాండ్ పెరిగి వీటి ధరలు మూడు రెట్లు పెరిగాయి. ఈ ప్రభావం స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు, స్మార్ట్ టీవీలు వంటి డివైజ్ తయారీ సంస్థలపై పడింది. ఈ డివైజుల్లో ర్యామ్, ఎస్ఎస్డీ కార్డుల తయారీల్లో ఈ చిప్స్ ఉపయోగిస్తారు. ఈ చిప్స్ వినియోగంలో 70 శాతం మార్కెట్ తో ముందున్న శాంసంగ్ మాత్రం ఏడాది ఉత్పత్తికి సరిపడా చిప్స్ బుకింగ్ చేసుకున్నట్లు సంస్థ తెలిపింది. అయితే, ప్రస్తుతం చిప్స్ కు మరింత డిమాండ్ పెరగడం, లభ్యత తగ్గడం వంటి కారణాలతో భవిష్యత్తులో కూడా స్మార్ట్ డివైజ్ లు, మెమరీ కార్డ్స్, ఎస్ఎస్డీ కార్డులు వంటివి తక్కువ ధరలో లభ్యం కాకపోవచ్చని మార్కెట్ నిపుణులు అంటున్నారు.
ఈ నేపథ్యంలో డెల్, ఏసస్, లెనోవో వంటి సంస్థలు కూడా 5 నుంచి 20 శాతం ధరలు పెంచేందుకు సిద్ధమవుతున్నాయి. అయితే, శాంసంగ్, యాపిల్ సంస్థలపై ఈ ప్రభావం పెద్దగా పడకపోవచ్చు. కారణం.. ఈ సంస్థలు కొన్నేళ్ల అవసరాలకు సరిపడా చిప్స్ అందించాలని ఆయా సంస్థలతో ఇప్పటికే ఒప్పందం చేసుకున్నాయి.