Medical priscription : ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రులలోని వైద్యులు రాష్ట్ర అధికారిక భాష అయిన కన్నడలో మెడికల్ ప్రిస్క్రిప్షన్లు రాసేలా ఆదేశాలు ఇవ్వాలని ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి దినేశ్ గుండూరావును సోమవారం కన్నడ డెవలప్మెంట్ అథారిటీ (KDA) కోరింది. కేడీఏ చైర్పర్సన్ పురుషోత్తం బిలిమలే దినేష్ గుండూరావుకు రాసిన లేఖలో.. కన్నడను ప్రోత్సహించే వైద్యులను ప్రభుత్వం గుర్తించి, గౌరవించాలని కోరారు.
కన్నడ భాష వినియోగం పట్ల నిబద్ధత చూపిన వైద్యులను ఏటా వైద్యుల దినోత్సవం సందర్భంగా తాలూకా, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో సత్కరించాలని బిలిమలే సూచించారు. ప్రైవేట్ ఆసుపత్రులలో కన్నడను ప్రేమించే వైద్యులు, ఆసుపత్రి నిర్వాహకులను ప్రోత్సహించాలని బిలిమలే మంత్రిని కోరారు. కర్ణాటక ఆరోగ్య మంత్రి దినేశ్ గుండూరావు.. కేడీఏ లేఖపై స్పందించారు. ‘ప్రిస్క్రిప్షన్లు, వైద్య నిబంధనలకు అనువైనవిగా ఉండాలి. ఒక వైద్యుడికి కన్నడ తెలిసి, స్పష్టంగా రాయగలిగితే వారు అలా చేయగలరు. అయితే, దానిని తప్పనిసరి చేయడం ఆచరణాత్మకంగా అనిపించదు’ అన్నారు.
‘ప్రిస్క్రిప్షన్లు రోగి, వైద్యుడు ఇద్దరికీ సౌకర్యవంతంగా ఉండే భాషలో ఉండాలి. ఇద్దరూ కన్నడను ఇష్టపడితే, ఆ భాషను ఉపయోగించవచ్చు, కానీ వైద్యులందరూ కన్నడలో రాయాలని ఆశించడం అసమంజసమైనది. వైద్య పదాలు, మందుల పేర్లు, రసాయన కూర్పులు ఆంగ్లంలో ఉన్నాయి. వాటిని కన్నడలోకి తప్పులు లేకుండా అనువదించడం సవాలుగా ఉంది. సూచన మంచిదే అయినప్పటికీ, అది ఆచరణ సాధ్యం కాదు’ అని మంత్రి తేల్చిచెప్పారు.