ఐపీఎల్లో ఆడకపోవడంపై సంచలన వ్యాఖ్యలు చేసిన రైనా!

ముంబై: గతేడాది జరిగిన ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్) నుంచి చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ సురేశ్ రైనా అర్ధంతరంగా తప్పుకోవడం ఆశ్చర్యం కలిగించింది. టోర్నీలో ఆడేందుకే దుబాయ్ వెళ్లిన రైనా.. అది మొదలు కాకముందే తిరిగి ఇండియాకు వచ్చేశాడు. అయితే తాను ఐపీఎల్ ఎందుకు ఆడలేదన్నదానిపై ఎన్నో పుకార్లు వచ్చినా ఇన్నాళ్లూ నోరు మెదపని రైనా.. తాజాగా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆడకపోవడానికి కారణాన్ని నేరుగా చెప్పలేదు కానీ.. టీమ్‌లో ఏదైనా జరిగిందా అన్న అనుమానం కలిగేలా రైనా మాట్లాడాడు.
టీమ్‌లో ఏం జరిగింది?
మనం సంతోషంగా లేకపోతే వెనక్కి వచ్చేయాలనేది నా ఆలోచన. నేను ఎవరినీ ఏదో చేయాలని ఒత్తిడి తీసుకురాను. కొన్నిసార్లు సక్సెస్ అనేది నెత్తికెక్కుతుంది. క్రికెటర్లు సహజంగానే తామకు తాము టీమ్ కంటే ఎక్కువని ఫీలవుతుంటారు. ఒకప్పుడు సినిమా నటులు ఇలా ఉండేవారు అని అవుట్‌లుక్‌తో ఇంటర్వ్యూలో రైనా అనడం విశేషం. ఇక ఐపీఎల్లో ఆడకపోవడం వల్ల తానేమీ బాధపడటం లేదని, తన పిల్లలు, కుటుంబంతో గడపడం సంతోషంగా ఉందని టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతను అన్నాడు. ఆ సమయంలో నా కుటుంబానికి నేను అవసరం. 20 ఏళ్లుగా నేను ఆడుతున్నా. కానీ అవసరమైన సమయంలో కుటుంబానికి మనం అందుబాటులో ఉండాలి. అందుకే ఆ సమయంలో ఐపీఎల్లో ఆడకుండా వెనక్కి వచ్చేయడమే సరైనదని నాకు అనిపించింది అని రైనా అన్నాడు. అయితే దుబాయ్ హోటల్లో రైనా బాల్కనీ ఉన్న రూమ్ కోసం అడిగాడని, అది కుదరకపోవడంతో అసంతృప్తి వల్లే తిరిగి ఇండియాకు వచ్చాడన్న వార్తలు వచ్చాయి.