Sunil Gavaskar : భారత జట్టును పొట్టి ప్రపంచ కప్ విజేతగా నిలిపిన రాహుల్ ద్రవిడ్(Rahul Dravid) తన కలన నిజం చేసుకున్నాడు. ఒక ఆటగాడిగా సాధించలేని ఐసీసీ ట్రోఫీని కోచ్‌గా ముద్దాడి మురిసిపోయాడు. దాంతో, 17 ఏండ్ల కాలంలో ఏ కోచ్ వల్ల కాని ఘనతను ఈ దిగ్గజ క్రికెటర్ సొంతం చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో.. యావత్ దేశం గర్వపడేలా చేసిన ద్రవిడ్‌కు ‘భారత రత్న'(Bharat Ratna) అవార్డు ఇవ్వాలని మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) డిమాండ్ చేశాడు.
‘భారత ప్రభుత్వం ద్రవిడ్‌ను భారత రత్న పురస్కారంతో గౌరవిస్తే బాగుంటుంది. ఆ అవార్డుకు ద్రవిడ్ అన్ని విధాలా అర్హుడు. భారత జట్టుకు ఆడిన వాళ్లలో ద్రవిడ్ గొప్ప ప్లేయరే కాదు గొప్ప కెప్టెన్ కూడా. అంతేకాదు నేషనల్ క్రికెట్ అకాడమీ చైర్మన్‌గా.. ఆ తర్వాత హెడ్‌కోచ్‌గా పనిచేసిన ద్రవిడ్ ప్రతిభగల కుర్రాళ్లను వెలికితీయడంలో మొనగాడు’ అని గవాస్కర్ అన్నాడు.
ఇప్పటివరకూ భారత రత్న అవార్డు అందుకున్న ఏకైక క్రికెటర్ సచిన్ టెండూల్కర్. 2014లో ఈ పురస్కారం సచిన్‌ను వరించింది. అప్పటి నుంచి 10 ఏండ్లు గడుస్తున్నా మరే క్రికెటర్ ఈ అవార్డుకు నోచుకోలేదు. దాంతో, టీమిండియా 13 ఏండ్ల ట్రోఫీ కరువు తీర్చిన ద్రవిడ్‌కు ఈ అత్యుత్తన్నత పురస్కారం ఇవ్వాలని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు.
రాహుల్ ద్రవిడ్ లేని భారత క్రికెట్‌ను ఊహించలేం. సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar), సౌరభ్ గంగూలీ (Sourabh Ganguly), అజారుద్దీన్ (Azharuddin)లు దూకుడును నమ్ముకొని స్టార్ ఆటగాళ్లుగా పేరుతెచ్చుకుంటే.. ద్రవిడ్ మాత్రం తన సొగసైన ఆట, బలమైన టెక్నిక్‌తో టెస్టు స్పెషలిస్ట్‌గా మారాడు.ఆస్ట్రేలియా గడ్డపై 2008లో తొలి టెస్టు విజయంలో ద్రవిడ్ కీలక పాత్ర పోషించాడు. కంగారూ పేస్ దళాన్ని సమర్దంగా ఎదుర్కొంటూ పెర్త్ టెస్టులో 93 పరుగులతో టీమిండియాను గెలిపించాడు.
ఇక భారత్.. దాయాది పాకిస్థాన్‌పై 2005లో తొలి సిరీస్ గెలవడంలో ద్రవిడ్ రోల్ ఉంది. బౌన్సీ పిచ్‌లకు కేరాఫ్ అయిన దక్షిణాఫ్రికా గడ్డపై తొలి విజయాన్ని రుచి చూసిన కెప్టెన్ కూడా ద్రవిడే కావడం విశేషం. టెస్టుల్లో 36, వన్డేల్లో 12 సెంచరీలు బాదిన ద్రవిడ్ 2012లో తనకెంతో ఇష్టమైనక్రికెటకూ వీడ్కోలు పలికాడు. రిటైర్మెంట్ అనంతరం అండర్ 19 జట్టుకు కోచ్‌గా, బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ చీఫ్‌గా కొనసాగాడు. రవిశాస్త్రి తర్వాత టీమిండియా కోచ్‌గా పగ్గాలు అందుకున్న ద్రవిడ్ టీ20 చాంపియన్‌గా కెరీర్‌ను ముగించాడు.