Ben Stokes : వన్డేలు, టీ20ల్లోనే కాదు ఈమధ్య టెస్టుల్లోనూ స్లో ఓవర్ రేటు (Slow Over Rate) జరిమానాలు పెరుగుతున్నాయి. ఈ నిబంధనపై ఇప్పటికే కొందరు కెప్టెన్లు పెదవి విరుస్తుండగా.. ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ (Ben Stokes) సైతం మండిపడ్డాడు. భారత జట్టుతో మాంచెస్టర్ టెస్టుకు ముందు అంతర్జాతీయ క్రికెట్ మండలి(ICC)పై స్టోక్స్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. మీడియా సమావేశంలో స్లో ఓవర్ రేటు విషయాన్ని ప్రస్తావిస్తూ ఐసీసీకి అసలు కామన్సెన్స్ లేదని అన్నాడు. అంతేకాదు వివిధ దేశాల్లో స్లో ఓవర్ రేటు రూల్‌ను సవరించాల్సి ఉందని ఇంగ్లీష్ సారథి అభిప్రాయం వ్యక్తం చేశాడు.
ఐసీసీ నియమాల ప్రకారం టెస్టుల్లో ఒకరోజు 90 ఓవర్లు వేయాలి. కానీ, లార్డ్స్ టెస్టులో ఇంగ్లండ్ బౌలర్లు 75 ఓవర్లు వేశారంతే. దాంతో, స్లో ఓవర్ రేటు కారణంగా స్టోక్స్ బృందానికి భారీగా జరిమానాతో పాటు డబ్ల్యూటీసీలో రెండు పాయింట్ల కోత కూడా పడింది. ఐసీసీ తీరుతో ఆగ్రహించిన స్టోక్స్.. స్లో ఓవర్ రేటు నియమంలో మార్పులు చేయాల్సిందేనని అన్నాడు. ‘ఇంగ్లండ్ మాదిరిగా ఆసియాలో ఇదే రూల్ ఉండదు. అక్కడ స్పిన్నర్లు 70 శాతం ఓవర్లు వేస్తారు. కానీ, బౌన్సీ, పేస్ పిచ్‌లు ఉండే న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లో అది సాధ్యం కాదు. ఇక్కడ పేసర్లు 70 నుంచి 80 ఓవర్లు వేస్తారు. అయితే.. స్పిన్నర్లు తమ కోటాను తక్కువ సమయంలోనే పూర్తి చేయగలరు. అదే పేస్ బౌలర్లు ఎక్కువ సమయం తీసుకుంటారు. కామన్ సెన్స్ ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ విషయం అర్ధమవుతుంది. అందుకే.. ఒక్కో ఖండానికి ఒక్కోలా స్లో ఓవర్ రేటను నిబంధనను సవరించాల్సి ఉంటుంది’ అని స్టోక్స్ వెల్లడించాడు.
What really slows down an over rate? 🤔#BenStokes offers a captain’s perspective on what’s truly happening out there.#ENGvIND 👉 4th Test, Day 1 | WED, 23rd JULY, 2:30 PM | Streaming on JioHotstar pic.twitter.com/UyluFtwrXY
— Star Sports (@StarSportsIndia) July 22, 2025
అంతేకాదు ఓవర్ రేటు అనేది తనను ఎంతో ఆందోళనకు గురి చేస్తుందని ఇంగ్లండ్ సారథి తెలిపాడు. అలా అనీ తాను ఉద్దేశపూర్వకంగా తక్కువ ఓవర్లు వేయించడం లేదని స్టోక్స్ వాపోయాడు. కాబట్టి ఈ నియమంలోని లోపాలను సరిచేసి.. కొత్తగా అమలు చేయాల్సిన అవసరం ఉందని ఈ ఆల్‌రౌండర్ అన్నాడు. భారత్, ఇంగ్లండ్‌ల మధ్య జూలై 23న మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రఫోర్డ్‌లో నాలుగో టెస్టు జరుగనుంది. ప్రస్తుతం 2-1తో ఆధిక్యంలో ఉన్న ఆతిథ్య జట్టు మరో విజయంతో సిరీస్ పట్టేయాలని భావిస్తోంది. మరోవైపు లార్డ్స్‌లో అనూహ్య ఓటమితో దెబ్బతిన్న పులిలా ఉంది టీమిండియా. సమిష్టిగా రాణించి స్టోక్స్ బృందానికి చెక్ పెట్టేందుకు గిల్ సేన వ్యూహాలు సిద్ధం చేసుకుంటోంది.