ఖైరతాబాద్ : రాష్ట్రంలోని రేవంత్ రెడ్డికి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ(Mandakrishna Madiga ) డెడ్‌లైన్ (Deadline) విధించారు. కాంగ్రెస్( Congress) పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే దివ్యాంగులు, చేయూత ఫించన్లు పెంచుతామని హామీ ఇచ్చారు. 20 నెలలు గడిచిపోయాయి. రూపాయి పింఛను పడలేదని ఆరోపించారు. ముఖ్యమంత్రి హామీనైనా నిలబెట్టుకోవాలి. లేదా రాజీనామానైనా చేయాలని డిమాండ్ చేశారు.
మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ఎన్నికల ముందు అప్పటి టీపీసీసీ అధ్యక్షులు, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దివ్యాంగులకు రూ.6వేలు, చేయూత కింద వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ, నేత, గీత కార్మికులు, మూత్రపిండాల బాధితులకు రూ.4వేల పింఛన్లు ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. పాత పింఛన్లు సైతం మొక్కుబడిగా చెల్లిస్తున్నారని ఆరోపించారు.
ముఖ్యమంత్రి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వేతనాలు ఏ తారీఖు తీసుకుంటున్నారో ప్రజల ముందు బహిర్గత పర్చాలన్నారు. 20 నెలలుగా రూ.20వేల కోట్లు పింఛన్ బకాయిలు అయ్యాయని తెలిపారు. ఆ డబ్బులను రైతు రుణమాఫీ, రైతు భరోసాకు మళ్లీంచారని, వాటికి తొందరేమి వచ్చిందన్నారు. సకాలంగులకు దోచిపెట్టి, అందాల పోటీలకు ఖర్చు చేసి, కండ్లు కనబడని వారు, కాళ్లు, చేతులు లేని వారు, సొంతంగా పనులు చేసుకోలేని వారికి మాత్రం పింఛన్లు ఇవ్వడానికి ప్రభుత్వానికి మనస్సు రావడం లేదని దుయ్యబట్టారు.
తక్షణమే మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాలని, ఆగస్టు మొదటి వారంలోపు పింఛన్లు చెల్లించాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి డెడ్‌లైన్ పెడుతున్నామన్నారు. ఆలోగా వారి పింఛన్ బకాయిలు డబ్బులు ఇవ్వకుంటే ఎమ్మార్పీఎస్, వీహెచ్పీఎస్ ఆధ్వర్యంలో ఆగస్టు 13న ఎల్బీ స్టేడియంలో లక్షలాది మందితో దివ్యాంగులు, చేయూత పింఛన్‌దారుల గర్జన కార్యక్రమాన్ని చేపడుతామని హెచ్చరించారు.