MP Engineer Rashid | న్యూఢిల్లీ : ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో బారాముల్లా ఎంపీ ఇంజినీర్ రషీద్‌కు ఢిల్లీ కోర్టు కస్టడీ పెరోల్ మంజూరు చేసింది. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో జులై 24 నుంచి ఆగస్టు 4వ తేదీ వరకు రషీద్‌కు అడిషనల్ సెషన్స్ జడ్జి చందర్ జిత్ సింగ్ కస్టడీ పెరోల్ మంజూరు చేశారు. గత పార్లమెంట్ సమావేశాల సమయంలో ఎంపీ రషీద్‌కు మధ్యంతర బెయిల్ కానీ, కస్టడీ పెరోల్ కానీ మంజూరు కాలేదు. తాజాగా ఆయనకు కస్టడీ పెరోల్ మంజూరైంది.
పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో.. లోక్‌సభకు హాజరయ్యేందుకు తనకు మధ్యంతర బెయిల్ లేదా కస్టడీ పెరోల్ మంజూరు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. మధ్యంతర బెయిల్‌ను తిరస్కరించిన కోర్టు.. ఆయనకు కస్టడీ పెరోల్‌ను మంజూరు చేసింది. కస్టడీ పెరోల్లో భాగంగా ఎంపీ రషీద్ వెంట సాయుధ బలగాలు ఉండనున్నారు.
ఎంపీ రషీద్‌ను చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం కింద ఎన్ఐఏ 2017లో అరెస్టు చేసింది. ఇక 2019 నుంచి ఆయన తీహార్ జైలులోనే ఉంటున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఒమర్ అబ్దుల్లాపై ఇంజినీర్ రషీద్ గెలుపొందిన విషయం తెలిసిందే. కశ్మీర్ లోయలో వేర్పాటువాద, తీవ్రవాద గ్రూపులకు నిధులు సమకూరుస్తున్నారనే కారణంగా కశ్మీర్ వ్యాపారి జహూర్ వాటాలిని ఎన్ఐఏని అరెస్టు చేసి విచారణ జరిపినప్పుడు రషీద్ పేరు వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో కశ్మీర్ వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్, లష్కరే తొయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్, హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ సైయద్ సలావుద్దీన్‌లపై కూడా ఎన్ఐఏ ఛార్జిషీటు దాఖలు చేసింది.