RK Roja | టీడీపీ, జనసేన నాయకులపై మాజీ మంత్రి, వైసీపీ నేత ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో గాల్లో గెలిచిన గాలిగాళ్లు ఎక్కువైపోయారని విమర్శించారు. ఇప్పటికే టీడీపీ, జనసేన నేతలు హైదరాబాద్‌కు పారిపోతున్నారని.. జగనన్న అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్, పవన్ కల్యాణ్ అమెరికా పారిపోవాల్సిందేనని ఎద్దేవా చేశారు. అప్పుడు టీడీపీ, జనసేన కార్యకర్తలను కాపాడటానికి ఎవరూ ఉండరని అన్నారు. ఇప్పుడు టార్చర్ పెట్టినా, కేసులు పెట్టినా దానికి వందరెట్లు వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని హెచ్చరించారు.
పవన్ కల్యాణ్‌కు పిచ్చి బాగా ముదిరిపోయిందని ఆర్కే రోజా విమర్శించారు. ఆయన ఎక్కడ పుట్టాడో, ఏం చదువుకున్నాడో ఆయనకే తెలియదని అన్నారు. ఎక్కడకు వెళ్లినా అక్కడే పుట్టానని చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఆఖరకు సుబ్రహ్మణ్య స్వామి అభిమానిని అని అంటాడని విమర్శించారు. ‘నాకు కొంచెం తిక్కుంది.. దానికో లెక్కుంది’ అని పవన్ కల్యాణ్ ఓ సినిమాలో డైలాగ్ చెప్పాడని.. ఇక్కడ చంద్రబాబు లెక్క ఎక్కువగా ఇస్తున్నట్లు ఉన్నాడని.. అందుకే పవన్ కల్యాణ్‌కు పిచ్చి బాగా ముదిరి పాకం పడిందన్నారు.
చంద్రబాబు, నారా లోకేశ్, పవన్ కల్యాణ్ వీకెండ్ నాయకులని ఆర్కే రోజా విమర్శించారు. ప్రజలకు రేషన్ ఇచ్చే వాహనాలకు డబ్బులు లేవు కానీ.. వీళ్లు మాత్రం హెలికాప్టర్లు, విమానాల్లో తిరుగుతున్నారని మండిపడ్డారు. టీటీడీ ఎస్వీ గోశాలలో అన్ని గోవులు చనిపోతే వాళ్లను శిక్షించకుండా, వచ్చి చూడకుండా ఉన్న పవన్ కల్యాణ్ ఏం సనాతన యోధుడు అని ప్రశ్నించారు. శ్రీశైలంలో తాబేళ్లు చనిపోయినా అక్కడకు కూడా వెళ్లలేదు.. కానీ తమిళనాడుకు వెళ్లి మాట్లాడతారని మండిపడ్డారు.